ఉదయగిరి: ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీ చౌటపల్లి గ్రామంలో బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి తల్లి వెంకటసుబ్బమ్మ ఉత్తరక్రియలు జరిగాయి. దీనికి మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హాజరై వెంకటసుబ్బమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారు?
● సీఎం చంద్రబాబుకు మాజీ మేయర్ లేఖ
నెల్లూరు(బారకాసు): ఆంధ్రప్రదేశ్‌లో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ‘ఆడబిడ్డ నిధి’ పథకం కింద ప్రతినెలా రూ.1,500 అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలంటూ మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి సీఎం చంద్రబాబుకు బుధవారం లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తికావస్తున్నప్పటికీ ఈ పథకం ఇంకా అమల్లోకి రాకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకు తక్షణమే కార్యాచరణ రూపొందించి, 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
గిడ్డంగుల్లో వసతుల
కల్పనకు చర్యలు
నెల్లూరురూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలోని 44 బహుళ ప్రయోజన సహకార గిడ్డంగుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం నెల్లూరులో జరిగిన సమావేశంలో గిడ్డంగుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై చర్చించారు. జిల్లా సహకార అధికారి బి.గురప్ప కమిటీకి సంబంధిత ప్రతిపాదనలు సమర్పించారు. డ్వామా నిధులతో అప్రోచ్ రోడ్లు, జిల్లా పరిషత్ నిధులతో విద్యుత్ సౌకర్యాలు, బోర్‌వెల్‌ల ఏర్పాటు అంశాలను చర్చించారు. అవసరమైన అంచనా వ్యయ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను జేసీ ఆదేశించారు. ముదివర్తి అన్నారెడ్డిపాళెం గిడ్డంగి మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద ఎంపికై న పడుగుపాడు పీఏసీఎస్ ప్రతిపాదించిన డీపీఆర్‌లను ఆమోదించారు. 44 సహకార గిడ్డంగులను జాతీయ గిడ్డంగుల ప్రాధికార సంస్థకు అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా సహకార అధికారి తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా జూనియర్ ఎన్టీఆర్
పుట్టినరోజు వేడుకలు
నెల్లూరు(బృందావనం): ప్రముఖ చలన చిత్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ కె.గంగాధర్, జూనియర్ ఎన్టీఆర్ సేవాదళ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ జి.మధుసూదన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. బాలాజీ నగర్ గీతామయి వృద్ధాశ్రమంలో, మైపాడు రోడ్డు వైకుంఠపురంలోని మున్సిపల్ స్కూల్లో పేదలకు అన్నదానం చేశారు. బాలాజీ నగర్ సెంటర్‌లో, ఎస్ 2 థియేటర్‌లో, నర్తకి సెంటర్‌లో కేక్ కటింగ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులతో కోలహలం నెలకొంది. కార్యక్రమంలో అసోసియేషన్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఎస్‌కే రియాజ్, సేవాదళ్ జిల్లాశాఖ వైస్ ప్రెసిడెంట్ జి.మధుసూదన్, సెక్రటరీ ఎన్.జగన్, ఫ్యాన్స్ జి.శ్రీధర్, తేజ, అశోక్, చంద్ర, సుమన్, గోపి తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో 41 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 41 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసా యి గంగ కాలువకు 1,050, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 80, పిన్నేరు కాలువకు 15, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


