కమీషన్‌ కొట్టు.. లోన్‌ పట్టు | - | Sakshi
Sakshi News home page

కమీషన్‌ కొట్టు.. లోన్‌ పట్టు

May 21 2026 12:44 AM | Updated on May 21 2026 12:44 AM

నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) రుణ వ్యవస్థలో అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మహిళల అభివృద్ధి కోసం ఉద్దేశించిన బ్యాంక్‌ లింకేజ్‌, సీ్త్రనిధి రుణాలు, జీవనోపాధి కార్యక్రమాల అమలులో కొందరు సిబ్బంది కమీషన్‌ దందా నడుపుతున్నారని తీవ్ర విమర్శలున్నాయి. రుణాల మంజూరుకు 5 నుంచి 10 శాతం వరకు కమీషన్‌ వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీఓఏలు, సీసీలు నుంచి మండల స్థాయి సమాఖ్య సిబ్బంది వరకు ఈ వ్యవహారంలో భాగస్వాములయ్యారన్న ఆరోపణలున్నాయి. కమీషన్‌ ఇచ్చిన గ్రూపులకు రుణాలు సత్వరంగా మంజూరవుతుండగా, ఇవ్వని గ్రూపులకు అనవసర జాప్యం చేస్తున్నారని బాధిత మహిళలు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో రుణాల మంజూరుకు ముందే డిజిటల్‌ చెల్లింపుల (ఫోన్‌పే వంటివి) ద్వారా నగదు వసూలు చేస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులిచ్చిన వారికి పని వేగంగా జరుగుతోందని, ఇవ్వని వారికి నెలల తరబడి ఫైళ్లు ఆగిపోతున్నాయని గ్రూప్‌ సభ్యులు వాపోతున్నారు.

పలు నియోజకవర్గాల్లో..

జిల్లా వ్యాప్తంగా సుమారు 38 వేల స్వయం సహాయక గ్రూపులుండగా, నాలుగు లక్షల మందికి పైగా మహిళలు ఈ వ్యవస్థపై ఆధారపడి పొదుపు చేస్తున్నారు. కొత్త గ్రూపుల ఏర్పాటు, పొదుపు, రుణాలు మంజూరు చేయించం, రికవరీలు, సభ్యులకు శిక్షణలు, పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు ఉద్యోగులున్నారు. గ్రామ సంఘం బంధాలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలున్నాయి. జిల్లా, మండల సమాఖ్యలకు మహిళలు అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర సభ్యులున్నారు. ఇంతమంది ఉన్నా కమీషన్లు ఇవ్వనిదే తోటి మహిళలకు రుణాలు మంజూరు కావడం లేదు. ప్రతి సంవత్సరం బ్యాంక్‌ లింకేజ్‌ రుణాలుగా రూ.1,400 కోట్లు, సీ్త్రనిధి రుణాలుగా రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు పంపిణీ అవుతున్నాయి. 2026 – 27లో రూ.600 కోట్ల సీ్త్రనిధి రుణాలను లక్ష్యంగా నిర్దేశించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ప్రవహిస్తున్నా క్షేత్రస్థాయిలో పారదర్శకత లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలోని సర్వేపల్లి, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో ఈ కమీషన్‌ వ్యవహారం ఎక్కువగా ఉందని ఆరోపణలున్నాయి. బ్యాంకు లింకేజ్‌, పరిశ్రమల ఏర్పాటు, జీవనోపాధి పథకాల పేరుతో కూడా అదనపు వసూళ్లు జరుగుతున్నాయని గ్రామీణ మహిళలు చెబుతున్నారు.

స్వాహా చేస్తూ..

రాపూరు మండలంలోని తెగచర్ల గ్రామంలో యానాది సంఘం పేరుతో రూ.7 లక్షలు స్వాహా చేసిన ఘటనపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యల్లేవనే ఆరోపణలున్నాయి. గరిమెనపెంట, తెగచెర్ల, గోనుపల్లి వంటి గ్రామాల్లో కూడా ఇదే తరహా అక్రమాలు జరిగాయని సమాచారం. యానాది గ్రూపుల పేరుతో తీసుకున్న రుణాలను కొందరు వడ్డీ వ్యాపారాలకు మళ్లిస్తున్నారని, నెలకు భారీగా ఆదాయం పొందుతున్నా వ్యవస్థలో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో నిజాలు బయటపడాలంటే ఉన్నతస్థాయి విచారణ అవసరమని అభిప్రాయపడుతున్నారు.

యానాది గ్రూపుల పేరుతో రూ.లక్షల స్వాహా

ఎస్‌హెచ్‌జీల నుంచి

5 శాతం వసూలు చేస్తున్న సిబ్బంది

ప్రతి ఏడాది రూ.వందల కోట్ల లింకేజ్‌ రుణాలు

మండల సిబ్బంది చేతివాటం

రికవరీలు స్వాహా చేస్తున్న సిబ్బంది

కఠిన చర్యలు తీసుకుంటాం

గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధే మా ప్రధాన లక్ష్యం. రుణాల మంజూరులో కమీషన్‌ వసూ లు చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారణ జరుపుతాం.

– నాగరాజకుమారి, డీఆర్‌డీఏ పీడీ

Advertisement
 
Advertisement
Advertisement