నెల్లూరు(అర్బన్): ఆలిండియా సమ్మెలో భాగంగా జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. నెల్లూరులోని కాపువీధి సమీపంలెపి రెడ్డివారి వీధిలో హోల్‌సేల్ దుకాణాలు మూతపడటంతో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. జిల్లా వ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్ మందుల దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు నిరసన తెలిపారు. గాంధీబొమ్మ నుంచి ట్రంక్ రోడ్డు వరకు కెమిస్ట్‌లు, డ్రగ్గిస్ట్‌లు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్ మాట్లాడుతూ ఫార్మసీ రంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్‌లు, అనధికార ఆన్‌లైన్ మందుల విక్రయాలు, యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మసీ చట్టంలోని లోపాలు రోగుల భద్రతకు ముప్పుగా మారాయన్నారు. అక్రమ ఆన్‌లైన్ విక్రయాలను అరికట్టాలని, కార్పొరేట్ సంస్థల రిబేట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవల కోసం నగరంలో 11 ప్రాంతాల్లో మెడికల్ షాపులు తెరిచి ఉంచామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు నరేంద్ర, అశోక్, అయితా భాస్కర్, అనిల్, సుధ తదితరులు పాల్గొన్నారు.


