● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
నెల్లూరురూరల్: ‘కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేస్తోంది. దీనికి ప్రజల మద్దతు లభిస్తోంది’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని నాలుగో డివిజన్ జాకీర్‌హుస్సేన్ నగర్‌లో వైఎస్సార్‌సీపీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. డివిజన్ ఇన్‌చార్జి సందాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనతో విసిగిపోయి, మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో 4వ డివిజన్‌లో పార్టీకి భారీ మద్దతు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


