రాపూరు: పట్టణంలోని పాత ఎస్టీ హాస్టల్ భవనం పైఅంతస్తులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు భవనం మిద్దె పైకి వెళ్లి పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై తిరుమలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. అక్కడ ఖాళీ మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లున్నాయి. అతను చనిపోయి ఐదురోజులై ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతదేహం లభ్యం
సంగం: మండలంలోని చెన్నవరప్పాడు – కావలి కాలువ వద్ద మోటార్ మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి గల్లంతైన వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పి.మాల్యాద్రి (45) ఎలక్ట్రికల్, మోటార్ మరమ్మతుల పనులు చేస్తుంటాడు. మంగళవారం గ్రామ సమీపంలోని కాలువ వద్ద మోటార్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. వెంటనే గ్రామస్తులు, పోలీసులు కలిసి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం కాలువలో నీటిమట్టం తగ్గిన తర్వాత గాలింపు కొనసాగించగా మాల్యాద్రి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంగం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


