ఆత్మకూరు: విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే క్రమంలో షాక్‌కు గురై స్తంభంపై నుంచి పడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడంతో బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, సీఐటీయూ, సీపీఎం నాయకులు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరికి చెందిన రామ్‌ప్రసాద్ (20) అనే యువకుడు విద్యుత్ వైర్లు బిగించే పని కోసం ఆత్మకూరు సబ్ డివిజన్ ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ కింద పనులు చేస్తున్నాడని, మంగళవారం సాయంత్రం నల్లగొండలో పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై స్తంభంపై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలై మరణించారన్నారు. ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ తనకు సంబంధం లేనట్లుగా పరారయ్యాడని, బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ స్వప్నకు వినతి పత్రం అందజేశారు. నాయకులు శివప్రసాద్, లక్ష్మీపతి, డేవిడ్‌రాజు, నాగయ్య, రమణయ్య, హజరత్తయ్య, మహేష్ పాల్గొన్నారు.


