● పంట కాలువలు కనిపించకుండా
ప్లాట్ల అమ్మివేత
● లబోదిబోమంటున్న కొనుగోలుదారులు
కావలి రూరల్: ఒకవైపు నుడా పర్మిషన్లతో లేఅవుట్లు వేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ కొంతమంది బడా వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బఫర్ జోన్లను సైతం వదలకుండా పంట కాలువలను ఆక్రమించి పంట భూములను చదును చేసి కొనుగోలుదారులకు అక్రమ ప్లాట్లను అంటగడుతున్నారు. వంటకాలువలు కనిపించకుండా పరదాలు కట్టి స్థలాలను విక్రయిస్తుండడంతో తీరా మోసపోయిన పలువురు కొనుగోలుదారులు విషయం తెలుసుకుని మనోవేదనకు గురవుతున్నారు. ఇలా ఆముదాలదిన్నె గ్రామ పంచాయతీ బిట్– 2లో ఆరు ప్లాట్లు అక్రమ అమ్మకం జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు.
తేలిపోయిన టీడీపీ ఆరోపణలు
గత ప్రభుత్వంలో 127 ఎకరాలు ఆక్రమణకు గురైందని టీడీపీ నేతలు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా.. 127 ఎకరాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకుండా నిజ నిర్ధారణ కాలేదు. టీడీపీ నేతల ఆరోపణలు రుజువు కాకుండాపోయింది.
ప్రస్తుత ప్రభుత్వంలో..
గత కొంతకాలంగా ఆముదలదిన్నె గ్రామ పంచాయతీలో 12 ఎకరాల లేఅవుట్ స్థలంలో పంట కాలువలను ఆక్రమించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ యజమాని దానికి స్పందించి పంట కాలువలను పునర్నిర్మించగా, కానీ పక్కనే ఉన్న మరో యజమాని మూడు ఎకరాలలో లేఅవుట్లు వేసి నూడా అప్రూవల్ తీసుకోకుండా వాటిలో ఆరు ప్లాట్ల అమ్మకాలు జరిపారు. వారి ప్లాట్లలో ఉన్న పంట కాలువలను పునరుద్ధరించకుండా వారి స్థలాల్లోనే కట్టుబడి చేయాల్సి ఉండగా ఇప్పటికీ దానిపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ డీఈ మొహమ్మద్ ఖాన్‌ను సంప్రదించగా స్థానిక రెవెన్యూ సిబ్బందికి తెలియజేశామని, ఒకవైపు విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారని, వీలైనంత త్వరలో వాటిపై చర్యలు తీసుకుని పంట కాలువలను పూర్తిగా పునరుద్ధరిస్తామని తెలిపారు. కొనుగోలుదారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, పూర్తి సమాచారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేయాలని కోరారు.


