సింహ వాహనంపై లక్ష్మీనృసింహుడు | - | Sakshi
Sakshi News home page

సింహ వాహనంపై లక్ష్మీనృసింహుడు

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌ మండలంలోని వేదగిరి లక్ష్మీనరసింహస్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గిరిప్రదక్షిణ ఉత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్‌ అచ్యుత్‌రెడ్డి, ఈఓ గిరి తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ కలహాలతో

వ్యక్తి ఆత్మహత్య

ముత్తుకూరు(పొదలకూరు): కుటుంబ కలహాల కారణంగా విజయవాడ ప్రాంతానికి చెందిన ఎస్కే అబ్దుల్లా(38) అనే కార్మికుడు ఏపీ జెన్‌కో ప్రాజెక్టు కాలనీలో బుధవారం తాను ఉన్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీ జెన్‌కోలో యాక్టివ్‌ పవర్‌ సిస్టమ్స్‌ కంపెనీ ద్వారా మూడో యూనిట్‌లో ఓవరాలింగు వర్క్‌ చేసేందుకు రెండు రోజుల క్రితం వచ్చారు. కార్మికుడు మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కృష్ణపట్నం ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు.

పెళ్లికెళ్లి వస్తుండగా..

బైక్‌ అదుపుతప్పి దంపతులకు

తీవ్రగాయాలు

దగదర్తి: వివాహానికి వెళ్లి వస్తుండగా ఉలవపాళ్ల జాతీయ రహదారి వద్ద బైక్‌ అదుపుతప్పడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. జమ్మలపాళెంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం జరిగిన వివాహానికి అనంతవరం గ్రామానికి చెందిన నరసింహారావు, కామాక్షి దంపతులు బైక్‌పై వెళ్లి వస్తుండగా ఉలవపాళ్ల వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహారావు కాలుకు తీవ్ర గాయం కాగా కామాక్షి తలకు గాయాలయ్యాయి. హైవే మొబైల్‌ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హైవే అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్‌ తెలిపారు.

రైలు నుంచి జారిపడి

వ్యక్తి మృతి

నెల్లూరు సిటీ: రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి జారిపడి మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన రాజేష్‌కుమార్‌ యాదవ్‌(28) గత కొంత కాలంగా అనారోగ్య కారణంగా తమిళనాడులోని కాట్పాడిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం తిరిగి తన ఊరికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కారు. రాజేష్‌ మరుగుదొడ్డికి వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా రాజేష్‌ కనిపించలేదు. దీంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా కొమ్మరపూడి సమీపంలో రైలు పట్టాలపై రాజేష్‌ మృతదేహం పడి ఉండడాన్ని స్థానికుల సమాచారంతో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్సై హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ను ఢీకొన్న కారు

యువకులకు గాయాలు

సంగం: బైక్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కొరిమెర్ల సమీపంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. సంగం గ్రామానికి చెందిన వికాస్‌, వీరేంద్రలు ద్విచక్ర వాహనంపై కొరిమెర్ల నుంచి వస్తుండగా ఆత్మకూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వికాస్‌, వీరేంద్రలకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజేష్‌ స్థానికుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement