కోవూరు: ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మహిళపై దాడి చేసి, గాయపరిచిన కేసులో ముగ్గురు నిందితులకు కోవూరు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కోవూరు పట్టణంలోని పూలతోట వీధికి చెందిన ముత్యాల సులక్షణ ఇంట్లోకి, అదే వీధికి చెందిన పల్లిబోయిన నాగమ్మ, పల్లిబోయిన శ్రీనివాసులు, కొప్పల సరోజనమ్మ అనే వ్యక్తులు 2022 జనవరి 13వ తేదీన అక్రమంగా ప్రవేశించారు. పాత కక్షల నేపథ్యంలో దౌర్జన్యం చేసి, ఆమెను విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎస్.శివ నమ్రత బుధవారం తీర్పు వెలువరించారు. పల్లిబోయిన నాగమ్మకు ఒక నెల సాధారణ జైలు శిక్ష, పల్లిబోయిన శ్రీనివాసులు, కొప్పల సరోజనమ్మకు మూడు నెలల జైలు శిక్ష, ముగ్గురు నిందితులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఎన్.సుకన్య వాదనలు వినిపించారు.
చోరీ జరిగినా.. కేసే లేదు
● వారం రోజుల క్రితం 14 సవర్ల బంగారం అపహరణ
● ఆలస్యంగా వెలుగులోకి..
వరికుంటపాడు: మండలంలోని వేంపాడు పంచాయతీ భోగ్యంవారిపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన శేషమ్మ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లి ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు 14 సవర్ల బంగారాన్ని అపహరించారు. ఘటనపై బాధితులు 22వ తేదీ 100 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించారు. అదేరోజు ఎస్సై ఎం.రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఈ వ్యవహారాన్ని బాధితులు బుధవారం మీడియా ఎదుట వాపోవడంతో విషయంలోకి వెలుగులోకి వచ్చింది. అయితే వారం రోజులు గడిచినా ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై రఘునాథ్‌ను సాక్షి వివరణ కోరగా పూర్తి వివరాలు సేకరించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
లారీని ఢీకొన్న కారు
దగదర్తి: నెల్లూరు వైపు నుంచి ఒంగోలుకు వెళ్తున్న కారు వేగంగా ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఘటన ఉలవపాళ్ల జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, గాయపడిన ముగ్గురిని హైవే అంబులెన్స్‌లో కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.


