బుచ్చిలో భారీ అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

బుచ్చిలో భారీ అగ్నిప్రమాదం

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

దగ్ధమైన వాహనాలు, సామగ్రి

సుమారు రూ.10 లక్షల నష్టం

బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలోని లైలా హాల్‌ సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి సేల్స్‌ పాయింట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీలక్ష్మీనరసింహస్వామి సేల్స్‌ పాయింట్‌కు చెందిన షెడ్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఇందులోని పాత, పనికిరాని వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటల ధాటికి అగ్నిజ్వాలలు పక్కనే ఉన్న ఇనుప అంగడికి కూడా వ్యాపించాయి. అక్కడ నిల్వ ఉంచిన భారీ మొత్తంలోని ప్లాస్టిక్‌ సామగ్రి అగ్నికి ఆహుతైంది. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.

తప్పిన పెను ప్రమాదం

మంటలు సమీపంలోని జామాయిల్‌ తోట వైపు వ్యాపించకుండా స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. షెడ్డులో ఉన్న ఖరీదైన ఫోర్‌ వీలర్‌ వాహనాలను చాకచక్యంగా బయటకు తీయడంతో భారీ ఆస్తి నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అక్కడి గడ్డికి నిప్పంటుకుని మంటలు వ్యాపించాయా? లేక విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పనికిరాని వాహనాలతో పాటు, ప్లాస్టిక్‌ సామగ్రి కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement