● త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
● రూ.20 లక్షల నష్టం
కొడవలూరు: గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. ఇంటి యజమాని సహా కుటుంబ సభ్యులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మండలంలోని పద్మనాభసత్రంలో బుధవారం చోటుచేసుకొంది. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కూట్ల మల్లికార్జున, మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మధ్యాహ్నం భోజనానికి ఉపక్రమించారు. అదే సమయంలో వంటింట్లో నుంచి గ్యాస్ సిలిండర్ ద్వారా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల ధాటికి పల్లెంలోని భోజనాన్ని అలాగే వదిలేసి కుటుంబ సభ్యులంతా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. మంటల ధాటికి ఇంట్లోని సర్వం బుగ్గిపాలయ్యాయి. ఇంటిని ఇటీవలే ఆధునిక హంగులతో నిర్మించుకున్నారు. అగ్నిమాపక వాహనం వచ్చే సమయానికే మంటల ధాటికి ఇంట్లోని ఏసీలు, ల్యాప్‌టాప్‌లు, టీవీ, పీఓబీ సీలింగ్, డబుల్ కాట్ మంచాలు, బీరువాలు తదితర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యాస్ సిలిండర్ లీకై న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. దాదాపు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు, నష్టం వివరాలను సేకరించారు.


