సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ప్రకృతి వనరులను దోచుకోవడంలో తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. రాత్రీ.. పగలనే తేడా లేకుండా గ్రావెల్, ఇసుకను కొల్లగొడుతున్నారు. మైనింగ్‌కు అనుమతుల్లేకపోయినా.. ప్రభుత్వానికి రాయల్టీలు చెల్లించకుండానే గ్రావెల్ దోపిడీ మూడు లోడ్లు.. ఆరు ట్రిప్పులు అనే తీరున సాగుతోంది.
అడ్డుకోగా.. రెచ్చిపోయి
ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం పల్లిపాళెం సమీపంలో గ్రావెల్ అక్రమ రవాణా రాత్రి వేళ జరిగింది. ఈ క్రమంలో రాయల్టీని చెల్లించాలని ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులు అడ్డుకోగా, తమ్ముళ్లు రెచ్చిపోయారు. అధికారం తమదని.. మీకెందుకు చెల్లించాలంటూ బూతులతో హడలెత్తించారు. మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ బృందాన్నీ లెక్కచేయలేదు. చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి సర్దుకోవాలని సలహా ఇచ్చి పంపిన ఘటన విస్మయానికి గురిచేసింది.
వెంచర్లకు యథేచ్ఛగా..
ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గ్రావెల్ దందాను సాగిస్తున్నారు. అనుమతుల్లేకపోయినా, తవ్వి వెంచర్లకు రవాణా చేస్తున్నారు. సంగంలోని కొండను తవ్వేసిన వీరి కన్ను తాజాగా పల్లిపాళెం సమీపంలోని ప్రభుత్వ భూములపై పడింది. జేసీబీని పెట్టి కొల్లగొడుతున్నారు. నాలుగు రోజులుగా ఇది జరుగుతోందని తెలుసుకున్న ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులు తరలింపును సోమవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. ప్రతి వాహనానికి రాయల్టీని చెల్లించి రవాణా చేసుకోవాలని సూచించగా, మాఫియా రెచ్చిపోయింది. ఈలోపు మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్, వారి బృందం సైతం అక్కడికి చేరుకుంది. అయితే మాఫియా మరింతగా రెచ్చిపోయి స్థానికంగా కొందరు యువతను పిలిపించి నానా హంగామా చేశారు. అఽధికార పార్టీ అండ ఉన్న తమపై మీ రుబాబు ఏమిటంటూ రెచ్చిపోయారు. ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులపై బండబూతులతో చెలరేగిపోయారు. ఓ దశలో దాడులకు పాల్పడే పరిస్థితి నెలకొనడంతో పోలీసులకు ఫోన్లో సంస్థ ప్రతినిధులు సమాచారమిచ్చారు. ఆపై చేరుకున్న ఖాకీలు, గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకోకపోగా, మాఫియాకు వెన్నుదన్నుగా నిలిచి సర్దుబాటు చేశారు.
అర్ధరాత్రి తవ్వకాలు, పోలీసుల సమక్షంలోనే ఏమ్మార్ సంస్థ ప్రతినిధులపై టీడీపీ నేతల దౌర్జన్యం
అధికారికంగా అనుమతులు
జిల్లాలో మైనింగ్ రాయల్టీ అధికారిక అనుమతులను ఏఎమ్మార్ సంస్థ పొందింది. దీనికి గానూ దాదాపు రూ.14 కోట్లను ప్రభుత్వానికి ప్రతి నెలా చెల్లిస్తోందని సమాచారం. దీంతో జిల్లాలోని నలుమూలలా తమ ఏజెంట్లను వీరు నియమించి, ఎక్కడ మైనింగ్ జరుగుతున్నా అక్కడ వాలిపోతున్నారు. మరోవైపు జిల్లాలో అనధికారికంగానే మైనింగ్ జరుగుతోంది. అయితే సదరు సంస్థ మాత్రం అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ వాహనానికి రూ, వందల్లో వసూలు చేస్తోంది. అధికారిక అనుమతులున్న చోటే వసూలు చేయాల్సి ఉన్నా, మిగిలిన చోట్ల సంస్థ దండుకుంటోంది. జిల్లాలో ఈ సంస్థకు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గ్రావెల్ మాఫియాతో గొడవలు జరగడం, పోలీస్ శాఖ సర్దుబాటు చేయడం పరిపాటిగా మారుతోంది.
గ్రావెల్, మైనింగ్ రవాణాలో ఏఎమ్మార్ సంస్థకు అధికారిక అనుమతులు
రాయల్టీగా ప్రతి నెలా రూ.14 కోట్లను సర్కార్‌కు చెల్లించేలా ఒప్పందం
అక్రమంగా తరలిస్తూ
దోచుకుంటున్న టీడీపీ నేతలు
సంగం మండలంలో అడ్డుకున్న ప్రతినిధులు
బూతులతో రెచ్చిపోయిన వైనం
అధికారులు ఫిర్యాదు చేశారు
పల్లిపాళెంలో గ్రావెల్‌ను తరలిస్తున్న విషయం మా దృష్టికొచ్చింది. మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత నరేష్‌కు ఏఎమ్మార్ సంస్థ సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకుందనే ఫిర్యాదు అందింది. పరిశీలిస్తున్నాం.
– రాజేష్, ఎస్సై, సంగం


