● పేదలకు ఒక్క గృహాన్నైనా
చంద్రబాబు కట్టారా..?
● క్రెడిట్ చోరీలో సిద్ధహస్తుడు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
మనుబోలు: గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చలువతోనే పేదలకు సొంతింటి కల సాకారమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జగనన్న కాలనీని మంగళవారం సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తమకు ఇళ్ల స్థలాలను జగనన్న ఇవ్వడమే కాకుండా గృహాలను నిర్మించిచ్చారని వారు తెలియజేశారు. జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని లబ్ధిదారులు నిర్వహించారు. అనంతరం కాకాణి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇళ్లను కాదు.. ఊళ్లనే తమ ప్రభుత్వం అప్పట్లో నిర్మించిందని గుర్తుచేశారు. మనుబోలులోని జగనన్న కాలనీలో 300 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించగా, ఇందులో 120 మంది నిర్మాణాలను ప్రారంభించారని తెలిపారు. 40 గృహాలు పూర్తవ్వగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జగనన్న దయతోనే తమ సొంతింటి కల సాకారమైందని లబ్ధిదారులు అంటున్నారని, నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదేననిపిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 22 నెలలైనా, కనీసం ఒక్క ఇంటినైనా నిర్మించారానని ప్రశ్నించారు. 2.5 లక్షల ఇళ్లను కట్టామంటూ నాయుడుపేటలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో అవాస్తవాలను సీఎం చంద్రబాబు మాట్లాడారని విమర్శించారు. గతంలో తాము కేటాయించి పూర్తి చేసిన ఇళ్లను ఇప్పుడు చంద్రబాబు ప్రారంభిస్తూ, తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీలో ఆయన సిద్ధహస్తులని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. నాలుగుసార్లు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి నిర్మించిచ్చిన దాఖలాలు ఉన్నాయానని ప్రశ్నించారు.
నోరు మెదపడంలేదు..
ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీ, నెల్లూరులో ఆరోపణలు చేసిన సోమిరెడ్డికి ఇప్పుడు కాంట్రాక్టర్లతో డీల్ కుదరడంతో నోరు మెదపడంలేదని విమర్శించారు. జగనన్న కాలనీల్లో ఆయన పర్యటిస్తే, జరిగిన అభివృద్ధి కంటికి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు వంద జన్మలెత్తినా ఇలాంటి కాలనీలను నిర్మించలేరని చెప్పారు. తాము నిర్మించిన కాలనీల్లో కనీస వసతులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలేదని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సీఎం అయ్యాక అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, ముంగర రవీందర్‌రెడ్డి, గుండాల ఆదినారాయణ, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, దువ్వూరు సుధాకర్‌రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, సూరపనేని కిశోర్‌నాయుడు, ఆవుల తులసీరామ్, గుంజి రమేష్, సన్నారెడ్డి జానకిరామిరెడ్డి, చల్లా నవకోటి, కోసూరు కోటేశ్వరగౌడ్, కేవీఆర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


