కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు

Apr 29 2026 7:18 AM | Updated on Apr 29 2026 7:18 AM

నెల్లూరు రూరల్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పార్టీ కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో మంగళవారం ములాఖత్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయట విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని సైతం సర్కార్‌ చేపట్టడంలేదని, పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వారు తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

12 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 74,286 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 33,186 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.44 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు డేటా ఎంట్రీ ఆపరేటర్‌, బేల్దారి, బ్యూటీషియన్‌, టైలరింగ్‌, డ్రైవింగ్‌ తదితర రంగాల్లో ఉచిత శిక్షణను ఇవ్వనున్నామని ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు కొండాయపాళెం గేట్‌ సమీపంలోని కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ

నెల్లూరు రూరల్‌: పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సూచించారు. నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి అటవీ, వన్యప్రాణి పరిరక్షణ కమిటీతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ, పోలీస్‌, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. ఎర్రచందనం రక్షణకు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తీర ప్రాంతాల్లో ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ వంటి కీలక అంశాలపై చర్చించారు. పెనుశిల లక్ష్మీనరసింహ వన్యప్రాణి అభయారణ్యానికి సంబంధించిన ఎకో సెన్సిటివ్‌ జోన్‌ మాస్టర్‌ ప్లాన్‌ పురోగతిని సమీక్షించారు. రిజర్వ్‌ అటవీ ప్రాంతాలకు వెలుపల ఉన్న రెవెన్యూ భూముల్లో పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల సంరక్షణలో భాగంగా ట్రీ ఫౌండేషన్‌ రూపొందించిన రెండు అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎఫ్‌ఓ మహబూబ్‌బాషా, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీపీఓ వసుమతి, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్‌, జిల్లా సర్వే, ల్యాండ్‌ రికార్డుల డీడీ నాగశేఖర్‌, సుప్రజ ధరిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement