క్రిస్‌ సిటీతో భారీగా ఉపాధి | - | Sakshi
Sakshi News home page

క్రిస్‌ సిటీతో భారీగా ఉపాధి

Apr 29 2026 7:18 AM | Updated on Apr 29 2026 7:18 AM

గూడూరు రూరల్‌: భారీ పారిశ్రామిక హబ్‌గా గూడూరు రూపుదిద్దుకోనుందని, ప్రతిష్టాత్మక క్రిస్‌ సిటీ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికిపైగా ఉపాధి లభించనుందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ప్రాజెక్ట్‌ పురోగతి, జాతీయ రహదారుల విస్తరణపై స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చిల్లకూరు మండలంలో ఏర్పాటు చేయనున్న క్రిస్‌ సిటీ ప్రాజెక్ట్‌ పనులు శరవేగంతో జరుగుతున్నాయని చెప్పారు. భూమి కోల్పోయిన బాధితులకు అందాల్సిన రూ.30 కోట్ల పరిహారాన్ని వచ్చే వారంలో నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు. జాతీయ రహదారి పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఆసహనం వ్యక్తం చేశారు. పనులు నిర్వహిస్తున్న మూడు ప్రధాన కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి.. పనులెక్కడ నిదానంగా జరుగుతున్నాయో గుర్తించి తక్షణమే వేగవంతం చేయాలని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్డీఓ సత్యనారాయణ, డీఎస్పీ గిరిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement