● డీజిల్ దొరక్క ఇబ్బందులు
పడుతున్న వాహనదారులు
● అత్యవసరమంటే 10 నుంచి 20 లీటర్లు మాత్రమే సరఫరా
● మధ్యలోనే నిలిచిపోతున్న
ట్రావెల్స్ వాహనాలు
● డీజిల్ లేక ఆగిన నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు
● ధరలు పెంచుతున్న వ్యాపారులు
● ధాన్యం, బియ్యం రవాణా
వాహనాలపై తీవ్ర ప్రభావం
● ఇసుక, గ్రావెల్, సిలికా మాఫియాకు సమృద్ధిగా డీజిల్ సరఫరా
● ఇబ్బందులు పడుతున్న
సామాన్య ప్రజలు
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత కూటమి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సంక్షోభంగా ప్రజాభిప్రాయం వెల్లడవుతోంది. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి చెబుతుండగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కేవలం ఈ రాష్ట్రంలోనే ఏర్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, ట్రాన్స్‌పోర్టు రంగంలోని బైక్‌లు, ఆటోలు మొదలు ట్రావెల్స్, గూడ్స్ రవాణా వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోతుంటే.. ఇసుక, గ్రావెల్, సిలికా తరలించే మాఫియా వాహనాలకు ఇంధనం సమృద్ధిగా దొరుకుతుండడం గమనార్హం. నిప్పులు చెరిగే ఎండలో నెల్లూరు నగరంలో ఆటోలు, కార్లు, బైక్‌లు బార్లు తీరిన దృశ్యాలు ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
నెల్లూరులోని మన్సూర్‌నగర్ ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్ద బారులు తీరిన ఆటోలు
నెల్లూరు (టౌన్): కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం, ముందు చూపు కొరవడి జిల్లా అధికార యంత్రాంగం కారణంగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం రోజు రోజుకు జఠిలమవుతోంది. మూడు రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఆదివారం నుంచి మొదలైన సమస్య రెండో రోజూ సోమవారానికి మరింత సంక్షోభ స్థితికి చేరింది. ఓ వైపు నిప్పులు చెరిగే ఎర్రటి ఎండలో ద్విచక్రవాహనాదారుల నుంచి ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, మినీ వాహనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నాయి. 10 లీటర్ల్ల డీజిల్ దొరకాలంటే వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయిల్ బంకుల్లో డీజిల్ సరఫరాపై నో స్టాక్ బోర్డులు పెట్టారు. పలుకుబడి ఉన్న, రాజకీయ నాయకులకు మాత్రమే డీజిల్‌ను సరఫరా చేస్తూ సామన్య ప్రజలను ఆయిల్ బంకుల యాజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రవాణా చార్జీలు అమాంతం పెరుగుదల
జిల్లాల్లో ప్రధానంగా ధాన్యం, బియ్యం, నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటితో పాటు ప్రయాణికులను రవాణా చేసే ఆటోల వారు సైతం డీజిల్‌కు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలను వ్యాపారులు అమాంతంగా పెంచారు. సరిపడా డీజిల్ దొరక్క ప్రతిరోజు జిల్లా నుంచి హైదరబాద్, బెంగళూరు, విశాఖపట్నం వెళుతున్న ట్రావెల్స్ బస్సులను పదుల సంఖ్యలో నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని బస్సుల్లో చార్జీలు పెంచడం గమనార్హం. సోమవారం హైదరాబాద్, విశాఖపట్నం నుంచి ప్రయాణికులతో చెన్నె వెళుతున్న కేవీఆర్, ఎంఆర్‌ఎం, సాలీమర్ తదితర 7 ట్రావెల్స్ బస్సులు డీజిల్ లేక సోమవారం తెల్లవారుజామున కొడవలూరు మండలం రామన్నపాళెం రైల్వే గేటు సమీపంలో నిలిచిపోయాయి. దీంతో బస్సుల్లో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు సమీపంలోని బంకుల యాజమానులను బతిమిలాడితే రెండు మూడు బస్సులకు 10 నుంచి 20 లీటర్లు మాత్రమే సరఫరా చేశారు. దీంతో ఆయా బస్సుల్లోని ప్రయాణికుల్లో కొంత మంది అధక ధరలతో బాడుగ కార్లు మాట్లాడుకుని వెళ్లగా, మరి కొంతమంది తమ సొంత కార్లును పిలిపించుకుని వెళ్లారు.
ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్ట్ మాఫియాకు
మాత్రం డీజిల్ సరఫరా
జిల్లాలో ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్ట్, బూడిద మాఫియాలకు మాత్రం సమృద్ధిగా డీజిల్ దొరుకుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల రవాణా వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతే.. ఈ వాహనాలు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతుండడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి అర్ధరాత్రి సమయంలో లైట్లు ఆపేసి డీజిల్ కొట్టి పంపిస్తున్నట్లు తెలిసింది. పలుకుబడి కలిగిన, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఆయా బంకులు యాజమానులు డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. ఎక్కువగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులకే ఈ వాహనాలు ఉన్నాయి.
ఇంధన ధరలు పెంచడానికేనా!
నెల్లూరు (పొగతోట): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వెనుక డబుల్ ఇంజిన్ కూటమి సర్కార్ ఇంధన ధరలు పెంచాలనే కుట్ర ఉందని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల్లోనే జిల్లాలో అనేక రంగాలు కుప్పకూలాయి. జిల్లాలో 243 పెట్రోలు బంకులు ఉండగా జిల్లాకు ప్రతి నిత్యం 375 కిలోలీటర్ల. పెట్రోలు, 738 కిలోలీటర్ల డీజిల్ సరఫరా అయ్యేది. వాస్తవానికి జిల్లాలో రోజుకు 314 కి.లీ. పెట్రోలు, 568 కి.లీ. డీజిల్ వినియోగం జరుగుతోంది. అయితే గత రెండు రోజులుగా జిల్లాకు అరకొరగా సరఫరా కావడంతో ఈ పరిస్థ్థితి తలెత్తినట్లు బంకుల యజమానులు చెబుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ఆయిల్ రిఫైన్ కంపెనీలపై పడే భారాన్ని తగ్గించేందుకే ఇలాంటిని పరిస్థితిని సృష్టించారని బంకుల యజమానులు అభిప్రాయపడుతున్నారు. సీఎన్‌జీ బంకుల్లో సైతం వాహనాలు బారులు తీరి ఉన్నాయి. బంకుల్లో ప్రజలు అడిగినంత పెట్రోలు, డీజిల్ నింపడంలేదు. డీజిల్ కొరతతో అంబులెన్స్‌లు సైతం సేవలు అందించలేని పరిస్థితులు ఉన్నాయి. ఆటోలపై ఆధారపడి ప్రయా ణం చేసే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాలపై కార్యాలయాలకు వెళ్లే అధికారులు సైతం పెట్రోలు, డీజిల్ కొరతతో అవస్థ పడుతున్నారు.
నిమ్మ మార్కెట్‌కు డీజిల్ సెగ
పొదలకూరు : డీజిల్ కొరత స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. డీజిల్ కొరతతో తోటల్లో నుంచి కాయలను మార్కెట్‌కు తరలించేందుకు ఆటోలు రావడమే కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతుంటే.. మార్కెట్ నుంచి కాయలను ఉత్తర భారత దేశానికి ఎగుమతి చేసేందుకు వ్యాపారులు కూడా ఆందోళన చెందాల్సి వస్తోంది. సోమవారం బీహార్ ప్రాంతానికి ఎగుమతులను వద్దన్న అక్కడి వ్యాపారులు తర్వాత డీజిల్ ఎలాగైనా తామే పట్టిస్తామనడంతో స్థానిక వ్యాపారులు కాయలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం బస్తా కాయలు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీదైన సరకును ఢిల్లీ, బీహార్, మధుర, లక్నో, వారణాశి తదితర ప్రాంతాలకు సకాలంలో చేర్చకపోతే వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వందల కి.మీ. వెళ్లాల్సిన లారీలు డీజిల్ కొరత వల్ల మధ్యలో నిలిచిపోతే పచ్చి సరుకు పాడై నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు.


