బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం | - | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు(వేదాయపాళెం): చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఏబీన్‌ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు గతంలో జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఇచ్చిన ఫిర్యాదుల పురోగతిని తెలుసుకునేందుకు సోమవారం ఆయన ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ, అడిషనల్‌ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో డీఎస్పీతో మాట్లాడి వెనుతిరిగారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర రాజధానిగా మావిగన్‌ పేరును ప్రస్తావించగానే చంద్రబాబులో కలవరం మొదలైందన్నారు. దాని పర్యవసానమే తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపై ఏబీఎన్‌ రాధాకృష్ణ ద్వారా అనుచిత వ్యాఖ్యలు పలికించారని తెలిపారు. ఈ విషయమై తాము నిరసనలు తెలిపి ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వర కు పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తాము, తమ పార్టీ శ్రేణులు ఏబీఎన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపితే సిబ్బందిని అడ్డుకున్నామని ఒక కేసు, డీఎస్పీ విధులకు ఆటంకం కలిగించామని మరో కేసు నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని, ఈ విషయమై తాము పోలీసులను అడిగితే దాటవేత, నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఫిర్యాదుల పురోగతి గురించి తాము అడిగితే సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందని సమాధానం ఇచ్చి తప్పించుకునేందుకు చూస్తున్నారని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా తాము సిద్ధమేనని తెలిపారు. ఏబీఎన్‌ రాధాకృష్ణపై చర్యలు తీసుకోకపోగా తిరిగి తమపైనే కేసులు నమోదు చేయించడం చంద్రబాబు నియంతృత్వపాలనకు నిదర్శనమన్నారు. 40 ఏళ్ల సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు ప్రతిపక్షాల పట్ల అణచివేత ధోరణితో అభాసుపాలవుతున్నారన్నారు. బాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు టోల్‌గేట్‌లో పనిచేసే మహిళలపై అనుచితంగా ప్రవర్తించి, వారిని దుర్భాషలాడి, దాడి చేసి గాయపరచిన కూడా ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోకపోవడం బాబు అహంకార ధోరణికి అద్ధం పడుతుందన్నారు. ప్రజలు అన్ని విషయాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారని తగిన సమయంలో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

సభ్యసమాజం సిగ్గుపడేలా

రాధాకృష్ణ వ్యాఖ్యలు

నెల్లూరురూరల్‌ పార్టీ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు, కుటుంబంలోని మహిళలపై ఏబీఎన్‌ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు. నెల్లూరు నగరంలో ట్రీప్ల్లాంటేషన్‌లో టీడీపీ నాయకుల అవినీతి భాగోతాన్ని తమ పార్టీ నాయకులు గణాంకాలతో సహా బట్టబయలు చేశారని తెలిపారు. దీంతో టీడీపీ నాయకుల అవినీతిని కప్పిపుచ్చేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారన్నారు. పార్టీ మహిళా విభాగం జోనల్‌ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, నాయకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, ధనూజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్రీ ప్లాంటేషన్‌లో అవినీతి

ఎమ్మెల్సీ, నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ట్రీ ప్లాంటేషన్‌ పేరుతో అంతులేని అవినీతి జరుగుతుందని తాము నిరూపించామని తెలిపారు. దీంతో మంత్రి నారాయణ, అవినీతితో సంబంధమున్న నాయకులు యూటర్న్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మొక్క నాటేందుకు రూ.5వేలు, నిర్వహణకు రూ.6,588 చొప్పున అంచనాలు సిద్ధం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ అవినీతి భాగోతం ప్రజలకు తెలియడంతో సీమరాజ అనే పెయిడ్‌ ఆర్టిస్ట్‌ను తీసుకొచ్చి నాటకాలు ఆడిస్తున్నారని, నగర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ అవినీతి, అక్రమాలపై జనవరి 26 తేదీన తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశా మని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement