అనుమసముద్రంపేట: ఏఎస్‌పేట దర్గాలో హుండీ కానుకల లెక్కింపును రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి సోమవారం ప్రారంభించారు. 9వ హుండీని లెక్కించగా రూ.20,22,100 నగదు, 3.800 గ్రాముల బంగారు, 800 గ్రాముల వెండి వచ్చినట్లుగా దర్గా ఈఓ హుస్సేన్ తెలిపారు. ఇప్పటి వరకు 9 హుండీల లెక్కింపు పూర్తయిందని, మొత్తం రూ.1,55,82, 071 రాబడి వచ్చిందని ఆయన వివరించారు. మరో పది రోజుల పాటు హుండీల లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు.
డ్వామా పీడీ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(పొగతోట): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వా మా) పీడీగా సీవీ శ్రీనివాసప్రసాద్ డ్వామా కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పీడీగా విధులు నిర్వహిస్తున్న గంగాభవాని తిరుపతి జిల్లా డివిజనల్ డెవలప్‌మెంట్ అఽధికారిణిగా బదిలీ అయ్యారు. నూతన పీడీని డ్వామా అడిషనల్ పీడీ స్వరూప్, ఏపీఓలు, టీఏలు, జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్
ఈఈగా ఆనంద్‌బాబు
నెల్లూరు(వేదాయపాళెం): జలవనరుల శాఖ నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఆనంద్‌బాబు రామలింగాపురంలోని ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గూడూరు డివిజన్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై అత్యంత కీలకమైన నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈగా నియమతులయ్యారు. జిల్లాలోని ఆత్మకూరు, గూడూరు డివిజన్లలో డీఈఈగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
పెరమన వీఆర్వోపై
సస్పెన్షన్ వేటు
సంగం: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మండలంలోని పెరమన వీఆర్వో ఎం కేశవమూర్తిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్‌ఐ ద్వారా అందిన అర్జీలపై నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించకపోవడం, గ్రామ సచివాలయంలో అందుబాటులో లేకపోవడం, పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన అర్జీల విచారణకు హాజరుకాకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం, క్రమశిక్షణ లోపించడం, తదితర అంశాలను తీవ్రంగా పరిగణించి సస్పెన్షన్ విధించినట్లుగా అందులో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కు వగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,878 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,037 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


