● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత దాపురించిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఓ పెట్రోల్ బంకును సోమవారం సందర్శించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. డీజిల్, పెట్రోల్ కోసం వచ్చిన రైతులు, వాహనదారులతో మాట్లాడారు. ఉదయం నుంచి బంకుల చుట్టూ తిరుగుతున్నామని, ఎక్కడా డీజిల్ పట్టలేదని కాకాణి ఎదుట క్యాన్లు పట్టుకుని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రైతులకు, సాధారణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, చంద్రబాబుకు ముందు చూపులేని కారణంగానే పెట్రోల్ బంకుల వద్ద కి.మీ. మేర వాహనాలు బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇంధన కొరత కారణంగా నిత్యావసర సరుకుల రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇంధనం పుష్కలంగా దొరుకుతోందని, అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు లేకపోయినా ధరలు తక్కువగా ఉండడమే కాకుండా, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా దొరుకుతుందన్నారు. ఇంధనం దొరక్క నెల్లూరు దాటి వెళ్లలేక వందలాది వాహనాలు హైవే పక్కన నిలిచిపోయాయన్నారు. చంద్రబాబు కేవలం మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడటం మానేసి, వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాష్ట్రానికి సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ఒక వైపు సివిల్ సప్లైస్ మంత్రి రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని చెబుతుంటే, మరో వైపు క్షేత్రస్థాయిలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని, ఈ పొంతన లేని మాటలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఆయిల్ సరఫరాను పునరుద్ధరించి పెట్రోల్ బంకుల వద్ద రద్దీని తగ్గించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


