సమస్యలు అనేకం.. పరిష్కారం గగనం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు అనేకం.. పరిష్కారం గగనం

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

పోటెత్తిన అర్జీదారులు

నెల్లూరురూరల్‌: ‘అయ్యా.. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. మీరైనా కనికరించండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ట్రెయినీ కలెక్టర్‌ పవన్‌ తేజ, డీఆర్వో విజయ్‌కుమార్‌ తదితరులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

పరిహారం చెల్లించాలంటూ..

వింజమూరు మండలం గుండెమడకల రిజర్వాయర్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులకు తక్షణం అవార్డు ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని మాజీ చైర్‌పర్సన్‌ చెంచలబాబుయాదవ్‌, గ్రామ రైతులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ రిజర్వాయర్‌ పనులు ఆగిపోవడంతో పాత చెరువు ఆయకట్టు కింద ఉన్న సుమారు 1,000 ఎకరాల మాగాణి భూములు బీడుగా మారినట్లు చెప్పారు. సుమారు రూ.78 కోట్లు చెల్లిస్తే రైతులకు న్యాయం జరిగి, కట్ట నిర్మాణం కూడా పూర్తవుతుందని పేర్కొన్నారు.

గోవధ నిషేధించండి

గోవధను నిషేధించాలని కల్లూరుపల్లిలోని శ్రీమావిస్‌ జైన్‌ పశుసేవా కేంద్రం వ్యవస్థాపకులు దినేష్‌ జైన్‌ సురేష్‌ జైన్‌, జలదీప్‌ జైన్‌ వినతిపత్రం సమర్పి ంచారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోసేవ కోసం కేంద్రం చట్టం తీసుకురావాలన్నారు.

ఆయిల్‌ కొరత లేకుండా చూడండి

జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేకుండా చూడాలని వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లాను కోరారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రభుత్వ భూముల ఆక్రమణ

కలువాయి మండలంలోని కుల్లూరులో గుంజి రవి ప్రభుత్వ స్థలాలు, గ్రామస్తుల డీ– పట్టాల భూములను ఆక్రమిస్తున్నారని అదే గ్రామానికి చెందిన దేవరకొండా శ్రీరాములు, దేవరకొండ వెంకట సుబ్బయ్య, తుపిలి లక్ష్మమ్మ, ఏగు నరసింహులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రవి పనులు చేయిస్తానని ప్రలోభాలకు గురిచేసి, ప్రభుత్వ, ఆర్‌అండ్‌బీ భూముల్లో దారులు లేకుండా గుంతలు తవ్వి, పెద్ద గేట్లు పెట్టారన్నారు. అతను అనుచరులతో కలిసి సర్వే నంబర్‌ 667–2బీ, 723–1, 733, 552/1లో ఆక్రమణలు చేసి వేరే వారికి కూడా అమ్మడం జరిగిందని అర్జీలో పేర్కొన్నారు.

పొదుపు సమస్యలపై వినతి

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వారు కలెక్టర్‌ను కలిసి పొదుపు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అర్జీ సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ నెల్లూరులో ఆన్‌లైన్‌ నమోదు పేరుతో పొదుపు మహిళలపై మెప్మా అధికారులు చేస్తున్న వేధింపులను ఆపాలన్నారు. రుణానికి ప్రభుత్వం తరఫున వడ్డీ మాఫీ ఇవ్వడం లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement