జిల్లాకు 148 ట్యాంకర్ల డీజిల్‌ మంజూరు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు 148 ట్యాంకర్ల డీజిల్‌ మంజూరు

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

కలెక్టర్‌ వెల్లడి

నెల్లూరురూరల్‌: జిల్లాకు 148 ట్యాంకర్ల డీజిల్‌ మంజూరైనట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం ఆయన అధికారులతో చమురు సరఫరా పరిస్థితిపై చర్చించారు. జిల్లాలో 271 డీజిల్‌ అవుట్‌లెట్లు ఉన్నాయని, వాటిలో 40 షాపుల్లో నిల్వలు కొంత తక్కువగా ఉన్నాయన్నారు. ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీల్‌ యాజమాన్యాలతో చర్చించామన్నారు. రవాణా విషయంలో జాప్య నివారణకు ఎస్పీతో కూడా మాట్లాడామన్నారు. కృష్ణపట్నం పోర్టు, కడప, చిత్తూరు నుంచి డీజిల్‌ అందుతుందన్నారు. వరి, రొయ్యల సాగుకు సరిపడా డీజిల్‌ అందిస్తామని, ఇందు కోసం ప్రతి షాపు దగ్గర ఒక వీఆర్‌ఓ, హోంగార్డును ఆధార్‌ కార్డుల పరిశీలనకు ఏర్పాటు చేశామన్నారు.

స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాక నేడు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీ, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ ఎన్‌.విజయానంద్‌ మంగళవారం నెల్లూరు నగరానికి రానున్నారు. విద్యుత్‌ భవన్‌లో ఏపీ ఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియన్‌ ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌, పలువురు విద్యుత్‌ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

జీతాలివ్వండి మహాప్రభో..

డీఆర్‌డీఏలో ఇదీ పరిస్థితి

నెల్లూరు(పొగతోట): డీఆర్‌డీఏ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి నుంచి 5వ తేదీలోపు అందాల్సిన జీతాలు 28వ తేదీ వచ్చిన ఇంతవరకు జమ కాలేదు. ఈఎంఐలు, ఇతర అవసరాల కోసం వేతనాలపై ఆధారపడి జీవనం సాగించే ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారు. డీఆర్‌డీఏలో జిల్లా వ్యాప్తంగా వివిధ హోదాల్లో 200 నుంచి 250 మంది పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, అనేక మండలాలు పాత జిల్లాల్లో విలీనం చేయడం తదితర కారణాలతో జీతాల మంజూరులో జాప్యం జరుగుతోందని అధికారులు సమాధానమిస్తున్నారు. మరోనెల కూడా వస్తోందని అయినా వేతనాలు అందుతాయో లేదోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

20 డ్రమ్ముల్లో

చికెన్‌ వ్యర్థాల పట్టివేత

మర్రిపాడు: మండలంలో చుంచులూరుక్రాస్‌ రోడ్డు వద్ద చికెన్‌ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని మర్రిపాడు ఎస్సై కాసుల శ్రీనివాసరావు సోమవారం పట్టుకున్నారు. ఆయన కథనం మేరకు.. కడప నుంచి అనుమతి లేకుండా వ్యర్థాలను తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీల్లో భాగంగా బొలెరో వాహనంలో సుమారు 20 డ్రమ్ముల చికెన్‌ వ్యర్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్‌, యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసిన వ్యర్థాలను గ్రామం బయట పూడ్చివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement