దొంగతనం కేసులో పురోగతి లేదు | - | Sakshi
Sakshi News home page

దొంగతనం కేసులో పురోగతి లేదు

Apr 28 2026 8:28 AM | Updated on Apr 28 2026 8:28 AM

ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు పోలీస్‌ కార్యాలయంలో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

నెల్లూరు(క్రైమ్‌): ‘మా ఇంట్లో గతేడాది సెప్టెంబర్‌లో దొంగతనం జరిగింది. రూ.లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకెళ్లారు. కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదు. త్వరితగతిన నిందితుడిని కనుక్కుని సొత్తును రికవరీ చేయాలి’ అని కావలికి చెందిన ఓ మహిళ కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. మీరైనా విచారించి న్యాయం చేయండంటూ బాధితులు ఉన్నతాధికారులను కోరారు. జిల్లా నలుమూలల నుంచి 148 మంది విచ్చేసి వినతులను ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రజా వినతుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని ఆయా ప్రాంత పోలీసు అధికారులకు సూచించారు. వినతుల్లో అధికశాతం మహిళలకు చెందినవే. కార్యక్రమంలో కావలి, డీటీసీ, మహిళా పోలీస్‌స్టేషన్‌ డీఎస్పీలు వీవీ రమణకుమార్‌, గిరిధర్‌, సత్యనారాయణ, మహిళా పోలీస్‌స్టేషన్‌, కంట్రోల్‌రూమ్‌, ఎస్‌బీ– 2 ఇన్‌స్పెక్టర్‌లు టీవీ సుబ్బారావు, భక్తవతల్సరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినతుల్లో కొన్ని..

● నా భర్త లక్ష్మణ్‌ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. మూడునెలల క్రితం ఆయన అదృశ్యమయ్యాడు. ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇంతవరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పీజీఆర్‌ఎస్‌లో చెప్పినా ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నా భర్త ఆచూకీ తెలియజేయాలని వింజమూరుకు చెందిన పావని వినతిపత్రమిచ్చారు.

● ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన కె.ప్రదీప్‌కుమార్‌, ఒంగోలుకు చెందిన వెంకటసురేంద్ర నా వద్ద రూ.1.25 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో నగదును తిరిగివ్వాలని అడగ్గా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ యువతి కోరారు.

● నా కుమార్తె ఈనెల 21వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదు. నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. త్వరితగతిన ఆచూకీ కనుక్కుని అప్పగించాలని నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ వివాహిత అర్జీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement