రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోనుపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనృసింహుడు అత్తారింటి నుంచి బయలుదేరి పెంచలకోనకు చేరుకున్నాడు. ఈ ప్రథమ ఊరేగింపుతో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు పెంచలస్వామి, సీతారామయ్య స్వామి తెలిపారు. గోనుపల్లిలోని ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులను దేవాదాయ సిబ్బంది గిరిజన కాలనీకి తీసుకొచ్చారు. అక్కడ గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఆథిత్యం ఇచ్చి పూజలు చేశారు. అనంతరం గోనుపల్లి నుంచి ఉభయ నాంచారులతో బయలుదేరిన లక్ష్మీనరసింహుడి పల్లకిని బోయలు కాళ్లకు పాదరక్షల్లేకుండా మోసుకుంటూ కోనకు చేరుకున్నారు. అలంకార మండపంలో బ్రహ్మోత్సవాల అంకుర్పారణ కార్యక్రమం జరిగింది.


