● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): అతను కుమారుడు పుట్టాడని ఆనందంలో ఉన్నాడు. భార్యాబిడ్డను చూసేందుకు మోటార్‌బైక్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి గ్రామానికి చెందిన పి.సునీల్ (30) సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఇటీవల కుమారునికి జన్మనిచ్చి మినగల్లులోని పుట్టింట్లో ఉంటోంది. ఆదివారం సునీల్ తిరుమలకు వెళ్లి దైవదర్శనం చేసుకుని సోమవారం నెల్లూరుకు వచ్చాడు. అనంతరం భార్య, కుమారుడిని చూసేందుకు ఇంటి నుంచి బైక్‌పై మినగల్లుకు బయలుదేరాడు. జొన్నవాడ ఆర్చివద్ద దేవరపాళెం నుంచి నెల్లూరు వైపు వేగంతో వెళ్తున్న బొలెరొ వాహనం ఢీకొంది. సునీల్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి వెంకయ్య ఈ మేరకు నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.


