పరిహారంలోనూ టీడీపీ ‘పచ్చ’పాతం | - | Sakshi
Sakshi News home page

పరిహారంలోనూ టీడీపీ ‘పచ్చ’పాతం

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

తరతరాలుగా సంప్రదాయ వృత్తి వేటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల విషయంలో తెలుగుదేశం పార్టీ ద్రోహం ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంది. వేట సాగితే కానీ పూట గడవని మత్స్యకారులకు కడలే జీవనాడి. భీతిల్లే అలల్లో ఊయలలు ఊగినంతగా అలవొకగా జలరాసిపై అనునిత్యం సాగర మదనం చేస్తే కానీ బతుకు బండి నడవదు. నిర్మానుష్య కల్లోల కడలిలోని అగాధ జలనిధిలో సాహస సమరంతో వేట సాగిస్తేనే భవిష్యత్‌. ఇల్లు విడిచి కడలిలోకి వెళ్తే.. తిరిగొచ్చే వరకు ప్రాణాలను పణంగా పెట్టి అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొనే గంగపుత్రులను ఆదుకునే విషయంలో సర్కారు మీన వేషాలు వేస్తోంది.

చేపలను తూకం వేస్తున్న మత్స్యకారులు (ఫైల్‌)

వైఎస్సార్‌సీపీ

పాలనలో

19,329

మంది

టీడీపీ పాలనలో

12,192 మంది

మత్స్యకార భరోసాను

తగ్గించి పెద్దకాపునవుతా

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మత్స్యకారుల బతుకులపై తెలుగుదేశం పార్టీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. గంగపుత్రులంటే సీఎం చంద్రబాబుకు ఆది నుంచి చిన్నచూపే. టీడీపీ నాలుగు దశాబ్దాల ప్రస్తావనలో 23 ఏళ్లు అధికారంలో ఉంటే.. అత్యధికంగా చంద్రబాబు ఇప్పటి వరకు 16 ఏళ్లకు పైగా అధికారాన్ని వెలగబెట్టారు. అయితే ఏ నాడు మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వారిని ఓటు బ్యాంక్‌గానే చూశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేలాది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కేవలం సముద్రంలో చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వీరి అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని సైతం దక్కనీయకుండా చంద్రబాబు, లోకేశ్‌ కుట్రలకు బరి తెగించారు. తమ భుక్తి అయిన వేట సాగించే సమయంలో తమిళ బోట్లు మత్స్య సంపదను దోచుకెళ్తుంటే ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను వదిలేసి తీరని ద్రోహం చేశారు.

ఇవే సవాలక్ష నిబంధనలు

ఈ ఏడాది వేట నిషేధ పరిహారం కోసం ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించింది. ఏప్రిల్‌ 14వ తేదీ నాటికి లైసెన్స్‌ రెన్యూవల్‌ అయి ఉండాలి. వేట చేసే బోటుకు జరిమానా విధించి ఉండకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ భరోసా వర్తిస్తుంది. వేట చేసే మత్స్యకారుడికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. లబ్ధిదారులు సామాజిక పింఛన్‌ తీసుకుంటుంటే వారికి ఈ పథకం వర్తించదు. విద్యుత్‌ 200 యూనిట్లు కంటే ఎక్కవ వాడకూడదు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. మోటారైజ్డ్‌ బోటులో ఆరుగురు, సంప్రదాయ పడవలో ముగ్గురు మాత్రమే వేట సాగిస్తూ ఉండాలంటూ నిబంధనలు పెట్టింది. ఈ నెల 29వ తేదీలోగా లబ్ధిదారుల ఫైనల్‌ జాబితా సిద్ధం కానున్నట్లు సమాచారం.

వేట నిషేధంపైనా కఠిన నిబంధనలు

వేట నిషేధింపైనా చంద్రబాబు సర్కారు కఠిన నిబంధనలు విధించింది. ఈ సమయంలో నిబంధనలు అతిక్రమించిన మత్స్యకారులకు ఏపీ సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే బోట్లును స్వాధీనం చేసుకోవడంతోపాటు జరిమానా విధించి, ప్రభుత్వం తరఫున ఇస్తున్న అన్ని రకాల రాయితీలు రద్దు చేస్తామంటూ రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3 వేలు – 3,500 మధ్య కుటుంబాలకు పరిహారం అందిస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద 19,329 మందికి లబ్ధి చేకూర్చారు. టీడీపీ పాలనలో అరకొరగా రూ.4000 ఇస్తున్న పరిహారాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచి అందించిన ఘటన వైఎస్‌ జగన్‌కే దక్కుతోంది. లబ్ధిదారుల ఎంపికలోనూ ఉదారంగా వ్యవహరించారు. అందరితోపాటు సంక్షేమ పథకాలతోపాటు వేట నిషేధ సాయాన్ని అందించారు. ఏటా రూ.19.33 కోట్లు అందించారు. ఇక డీజిల్‌పై సబ్సిడీని రూ.9లకు పెంచి ఆ మొత్తాన్ని అందించారు. ఇక ప్రమాదవశాత్తు వేట సమయంలో మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి టీడీపీ పాలనలో రూ.5 లక్షలు ఉంటే.. దాన్ని రూ.10 లక్షలకు పెంచి ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. 50 ఏళ్లకే పింఛన్‌ మొత్తం అందించారు.

మత్స్యకార భరోసా లబ్ధిదారులు

గంగపుత్రుల బతుకులపై కొనసాగుతున్న కుట్రలు, కుతంత్రాలు

వేట నిషేధ కాలంలో పరిహార

లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు

ఏటా రూ.20 వేలిస్తామని సవాలక్ష నిబంధనల పేరుతో అర్హుల్లో కోతలు

తొలి ఏడాది ఎగనామం..

మలి ఏడాదిలో లబ్ధిదారుల తగ్గింపు

ప్రకృతి విపత్తుల నేపథ్యంలో తరచూ వేటకు విరామం

తాజాగా పునరుత్పత్తి కాలంగా

రెండు నెలల పాటు వేట నిషేధం

కష్టకాలంలో సాయం చేయకపోగా తీరంలో వేట సాగించినా

భారీ జరిమానాలు..

కేసుల నమోదు హెచ్చరికలు

మొన్న బోట్లు మాయం చేసి

ద్రోహానికి తెగింపు

భవిష్యత్‌ కలల ప్రాజెక్ట్‌ జువ్వలదిన్నె

ఫిషింగ్‌ హార్బర్‌ను ప్రైవేట్‌ పరం చేసే కుట్ర

దగా.. దగా.. భారీగా లబ్ధిదారుల కుదింపు..!

మత్స్యకారులపై టీడీపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు కొనసాగుతూనే ఉన్నాయి. మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ, వారి భావితరాల అభివృద్ధికి ఏ నాడు చొరవ తీసుకోని చంద్రబాబు గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా వారిని దగాకు గురి చేస్తున్నారు. ఏటా మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసాగా రూ.20 వేలిస్తామని హామీల్చిన చంద్రబాబు.. తొలి ఏడాది ఎగనామం పెట్టారు. రెండో ఏడాదిలోనూ గతంలోని లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 19,329 మంది లబ్ధిదారులు ఉంటే, టీడీపీ పాలనలో గతేడాది 12,192 మందికే లబ్ధి చేకూర్చారు. ఈ ఏడాది ఇంకా కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ఎన్యుమరేషన్‌లోనూ లబ్ధిదారులను తగ్గించేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టడాన్ని మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఏటా ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు రెండు నెలల పాటు మత్స్యసంపద పునరుత్పత్తి కాలంగా భావించి సముద్రంలో వేట నిషేధం అమలు అవుతోంది. ఈ వేట నిషేధ కాలంలోనూ సాయం అందించడంలో గతంలో చంద్రబాబు ‘పచ్చ’ పాతం చూపించారు. పరిహారం ఒక్కొక్క కుటుంబానికి రూ.2000, ఆ తర్వాత రూ.4000 లెక్కన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 వేల నుంచి 3,500 మందికే వేట నిషేధ లబ్ధిని అందించిన పరిస్థితి. అర్హులు దరఖాస్తులు చేసుకున్నా.. అనేక కొర్రీలు వేసి అనర్హులుగా ప్రకటించి వారి పట్ల అమానవీయత చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇక మత్స్యకారుల వేటకు డీజిల్‌పై లీటర్‌కు రూ.6 సబ్సిడీని ప్రకటించినా.. ఏనాడు ఆ సబ్సిడీని దక్కించుకున్న పాపాన ఏ మత్స్యకారుడు పోలేదు. వేట సమయంలో మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఉన్నప్పటికీ అనేక కుటుంబాలకు ఆ బీమా పరిహారం కూడా దక్కక.. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కులేక రోడ్డున పడిన కుటుంబాలే అధికంగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement