ఉదయగిరి: జలదంకి, కలిగిరి మండలాల్లో చేపల చెరువులను జిల్లా మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతికుమారి ఆదివారం పరిశీలించారు. జలదంకి మండలంలోని చిన్నక్రాక మత్స్యకార సహకార సంఘ పరిధిలో గల కాకుటూరు, పెద్దకొండూరు, తిమ్మసముద్రం, మర్రిమాను, చిన్నక్రాక చెరువుల్లో చేపల అక్రమ వేటకు సంబంధించిన సమాచారంతో ఆమె పరిశీలించారు. చిన్నక్రాక మత్స్యకార సహకార సంఘంలోని బోగస్ సభ్యులను తొలగించి.. ఎన్నికలను నిర్వహించి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఈ చెరువుల్లో చేపలు పట్టడాన్ని నిలిపేయాలని ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. దీనిపై అవగాహన కల్పించే నిమిత్తం ఆమె వచ్చి సొసైటీ సభ్యులతో మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి చేపల వేటను సాగిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. మత్స్యశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


