చికెన్‌ వ్యర్థాల వాహనం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

చికెన్‌ వ్యర్థాల వాహనం పట్టివేత

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

సంగం: మినీలారీలో చికెన్‌ వ్యర్థాలు తరలిస్తుండగా మండలంలోని గాంధీజన సంఘం సమీపంలో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి అందులో సుమారు 25 డ్రమ్ము ల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వ్యర్థాలను సమీపంలోని కొండ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆరోగ్య సమస్యలతో

టీచర్‌ ఆత్మహత్య

కోట: మండలంలోని ఉత్తమ నెల్లూరు జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బల్లి ప్రసాద్‌ (54) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై పవన్‌కుమార్‌ కథనం మేరకు.. ప్రసాద్‌ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఉదయం టిఫిన్‌ తీసుకొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన అతను విద్యానగర్‌లో తెలుగుగంగ కాలువ సమీపంలో పెట్రోల్‌ పోసుకుని కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య దైవకృప కొత్తపాళెం పాఠశాలలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రసాద్‌ మృతదేహానికి పలువురు ఉపాధ్యాయులు నివాళులర్పించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

న్యూరో సమస్యలపై

అవగాహన తప్పనిసరి

నెల్లూరు(అర్బన్‌): రోజురోజుకూ ఎక్కువవుతున్న ఫిట్స్‌, పక్షవాతం, బ్రెయిన్‌ స్ట్రోక్‌, పార్కిన్సన్స్‌, కాళ్లు తిమ్మిర్లు లాంటి అనేక రకాల న్యూరో సమస్యలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజేశ్వరి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కొండేటి మాధవి అన్నారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో నారాయణ మెడికల్‌ కళాశాల న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సంపత్‌కుమార్‌, పెద్దాస్పత్రి న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ ఫణికుమార్‌ ఆధ్వర్యంలో న్యూరో అప్డేట్‌ 2026 అనే ప్రతిష్టాత్మక సదస్సు జరిగింది. నారాయణ కళాశాల న్యూరాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ అటాక్సియా, ఏఎల్‌ఎస్‌, ఎస్‌ఎంఏ, తలనొప్పి, డిమెన్సియా, న్యూరో ఇమ్యునాలజీ, న్యూరో మస్క్యులర్‌ డిజార్డర్స్‌ తదితరాలపై సమగ్రంగా వివరించారు. బేసిక్స్‌ టు బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ అనే ప్రధాన థీమ్‌తో ఈ సదస్సు నిర్వహించారు. దేశంలోని ప్రముఖ న్యూరాలజిస్టులు, ఎపిలెప్టాలిజిస్టులు, న్యూరో ఇమ్యునాలజీ నిపుణులు పాల్గొని తాజా వైద్య విధానాలు, జబ్బను నిర్ధారించే విధానాలు, చికిత్సల గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మస్తాన్‌బాషా, పలువురు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మోదీ పాలనలో

ప్రజాస్వామ్యానికి పాతర

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): దేశంలో ప్రజాస్వామ్యానికి పాతర వేసేలా మోదీ పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్య దర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ మహాసభలకు నెల్లూరు నుంచి వెళ్తున్న ప్రత్యేక వాహనాలకు సంతపేటలో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మోదీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఢీలిమిటేషన్‌ బిల్లుతో భవిష్యత్‌లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వరి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతున్నా పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు.

డయల్‌ యువర్‌

ఎస్‌ఈ నేడు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలను చెప్పాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement