ప్రభుత్వ స్థలమే కదా.. కబ్జా చేసేద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్థలమే కదా.. కబ్జా చేసేద్దాం

Apr 27 2026 7:24 AM | Updated on Apr 27 2026 7:24 AM

అధికార పార్టీ నేతల ప్రమేయం

ఆ స్థలంలో మట్టి తోలకం

చోద్యం చూస్తున్న

రెవెన్యూ అధికారులు

ఉదయగిరి: ఉదయగిరి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో కొండాయపాళెం పంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూముల కబ్జా పర్వం కొనసాగుతోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తుల ప్రమేయం ఉండటంతో రెవెన్యూ అధికారులు మౌనంగా ఉన్నారనే విమర్శలున్నాయి. తాజాగా కొండాయపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1297 – 1లో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. టీడీపీ నేత అండదండలతో ఓ వ్యక్తి అందులో ఆదివారం యథేచ్ఛగా అనుమతి లేకుండా వెంకట్రావుపల్లి చెరువు నుంచి గ్రావెల్‌ తరలించారు. ఈ భూమి ఉదయగిరి – గండిపాళెం రోడ్డు మార్గంలో ఉండటంతో మంచి గిరాకీ పలుకుతోంది. ప్రస్తుతం ఆక్రమణకు గురైన స్థలం విలువ మార్కెట్‌ రేటు ప్రకారం రూ.25 లక్షలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

ఫేక్‌ పట్టా సృష్టించి..

ప్రస్తుతం మట్టి తోలి చదును చేస్తున్న స్థలం సర్వేలో మొత్తం విస్తీర్ణం 3.50 ఎకరాలుంది. ఈ భూమికి కొంతమంది ఫేక్‌ పట్టా సృష్టించి హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా కొందరు జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం ఆర్డీఓ కోర్టులో విచారణలో ఉంది. టీడీపీ అధికారంలోకి రావడంతో విలువైన భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. 10 సెంట్ల భూమిని ఆక్రమించి పక్కనే ఉన్న వెంకట్రావుపల్లి చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలించి చదును చేస్తున్నారు. ఇంతా జరుగుతున్న రెవెన్యూ అధికారులు అక్రమణదారులపై చర్యలు తీసుకోలేదు.

ఫిర్యాదు చేయకుండా..

ఆక్రమణ విషయం రెవెన్యూ ఉన్నతాధికారులకు తెలియడంతో రెవెన్యూ సిబ్బంది స్పందించి పనులు నిలిపివేయించారు. కానీ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాల్సి ఉన్నా స్థానికంగా వీఆర్వో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఇప్పుటికే ఉదయగిరి పట్టణంలోని జాతీయ రహదారి వెళ్తున్న బైపాస్‌ మార్గంలో విలువైన ప్రభుత్వ స్థలాలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకారంతో స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుటికై నా తహసీల్దార్‌ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వీఆర్వో మాలకొండయ్య స్పందిస్తూ ఆక్రమణదారులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement