పొలానికి వెళ్లి.. విగతజీవిగా మారి
విడవలూరు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని దంపూరు పంచాయతీ గోల్కొండతోపు గ్రామ పొలాల్లో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన కుప్పా కామేశ్వరమ్మ (62) శనివారం మధ్యాహ్నం పొలం పనుల కోసం విడవలూరు మండలంలోని గోల్కొండతోపులో తన పొలం వద్దకు చేరుకుని పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో సాయంత్రం ఆమె పొలంలో స్పృహ లేకుండా పడిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు వ్యక్తులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై నరేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకునేసరికి కామేశ్వరమ్మ మృతిచెందిందని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కామేశ్వరమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ పొలం విషయంలో గతంలో ఎన్నోసార్లు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులకు, కామేశ్వరమ్మకు గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్‌ను, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమైపె దాడి జరిగి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గోల్కొండతోపునకు చెందిన గతంలో పొలం కవులకు చేసిన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పూడ్చిన స్థితిలో బాలుడి మృతదేహం
● 15 రోజుల క్రితం అదృశ్యం
చిల్లకూరు: తండ్రి పనిచేసే ప్రాంతానికి వచ్చిన చిన్నారి కనిపించడం లేదని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేస్తున్న క్రమంలోనే బాలుడి మృతదేహం లభ్యం కావడం గూడూరులో శనివారం సంచలనం కలిగించింది. గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరుకు చెందిన ఓ గిరిజన కుటుంబ వేములపాళెం సమీపంలోని సవక తోటల్లో పనులకు వెళ్తుంటారు. ఈనెల 10వ తేదీన తమ ఎనిమిదేళ్ల కుమారుడిని కూడా పనుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని వచ్చే సమయంలో తమ కుమారుడు లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటాడని భావించారు. అయితే అక్కడ కూడా లేకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి బాలుడి కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే శుక్రవారం వేములపాళెంలోని సవకతోట యజమాని చెట్లకు నీరు కడుతున్న సమయంలో ఓ మృతదేహం పూడ్చి పెట్టి బయటకు కనిపిస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఇన్‌చార్జి డీఎస్పీ గిరిధర్, సీఐ శేఖర్‌బాబు, ఎస్సై తిరుపతయ్య, వైద్యులు, తహసీల్దార్ ప్రసాద్‌లతో పాటుగా ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి చూడగా అదృశ్యమైన బాలుడిగా గుర్తించారు. అనంతరం శవ పంచనామా చేసినట్లు తెలిసింది. అయితే ఎనిమిదేళ్ల బాలుడు మృతికి కారణం ఆ తోటలో పనిచేసే 16 ఏళ్ల బాలుడే అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఆసక్తిని కనపరచడం లేదు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం వివరాలను వెల్లడించగలమని పోలీసులు తెలిపారు.


