ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి తీవ్రతకు మానవులతో పాటు పశుపక్షాదులు విలవిల్లాడుతున్నాయి. వడదెబ్బ ఎక్కడ తగులుతుందోననే భయంతో రాకపోకలు సాగించాలంటేనే పలువురు జంకుతున్న పరిస్థితి నెలకొంది. దీని నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు వేసవి సెలవులను ఇవ్వడం పరిపాటి. ఈ తరుణంలో వీరికి హాలిడేస్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. అయితే అంగన్‌వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులకు మాత్రం ప్రకటించడంలో సర్కార్ చోద్యం చూస్తోంది. ఫలితంగా కొందరు రావడంలేదు. ఆయాలు కష్టపడి కొందర్ని తీసుకొస్తున్నా.. వేసవి తాపం, ఉక్కపోతతో వీరు నానా ఇక్కట్లు పడుతున్నారు.
● వేసవి తీవ్రతతో విలవిల
● తగ్గిన హాజరు శాతం
● సెలవులను ప్రకటించని సర్కార్
● పక్క రాష్ట్రాల్లో మాత్రం హాలిడేస్
ఉదయగిరి: చిన్నారుల ఇబ్బందులు టీడీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదు. వేసవి తీవ్రతతో అంగన్‌వాడీ కేంద్రాలకు వీరెలా వస్తారనే కనీస ఆలోచన సర్కార్‌కు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడ సెలవులను నేటికీ ప్రకటించకుండా చోద్యం చూస్తోంది. అదే పక్క రాష్ట్రాల్లో వీటికి హాలిడేస్‌ను ఇచ్చారు. ఎండలు మండుతున్న తరుణంలోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వికటాట్టహాసం చేస్తోంది.
ఎందుకింత నిర్లక్ష్యం..?
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. అయితే అంగన్‌వాడీ కేంద్రాలకు దీన్ని వర్తింపజేయకపోవడంతో అక్కడికి చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ఎండల ధాటికి పెద్దలే ఇళ్లు దాటి బయటకు రాలేకపోతుంటే వీరినెలా పంపుతామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొందరు వస్తున్నా, చాలీచాలనీ ఇరుకు గదులు.. ఫ్యాన్లు లేకపోవడం.. గాలి.. వెలుతురు లేక విలవిల్లాడుతున్నారు. అదే విధంగా కేంద్రాల్లో పనిచేసే ఆయాలు, టీచర్లకు చెరో 15 రోజులు సెలవులివ్వాల్సి ఉంది. ఆ సమయంలో వీరిలో ఎవరో ఒకరు ఉండాలి. అయితే దీనిపైనా నేటికీ స్పష్టత కొరవడింది. మేలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది.
పౌష్టికాహార పంపిణీలో ఇక్కట్లు
కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంలో వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. కందిపప్పు, బియ్యం, ఆయిల్ మినహా మిగిలిన వాటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతి చిన్నారికి రూ.రెండు చొప్పున ప్రభుత్వం నిత్యం అందిస్తోంది. ఈ మొత్తంతో పౌష్టికాహారాన్ని ఎలా పెట్టగలమని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచాలని చెప్తున్న ప్రభుత్వం, వారికి స్నాక్స్‌ను అందించడంలో శ్రద్ధ చూపడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయ్య.. బాబోయ్
కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లున్నా, ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. వీరిని సముదాయించలేక ఆయాలకు తంటాలు తప్పడంలేదు. విద్యుత్ సరఫరా లో అంతరాయాలు సైతం ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. కేంద్రాలకొచ్చి పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన గర్భిణులు, బాలింతల వెతలు అన్నీ ఇన్నీ కావు.
అంగన్‌వాడీ సెంటర్
డిమాండ్లు పెడచెవిన
తమపై విపరీతమైన పనిభారం మోపడం ఎంత వరకు సబబని అంగన్‌వాడీ వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. వేతనాలను పెంచాలని.. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఓవైపు వీరు పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వానికి కనికరం కరువైంది. కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించకుండా కక్షపూరిత ధోరణిని అవలంబిస్తోందని యూనియన్ నేతలు మండిపడుతున్నారు.


