నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్‌లోని కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్‌ను శనివారం నిర్వహించారు. 2773 మందికి గానూ 2499 మంది హాజరయ్యారు. జిల్లాలోని 19 కేంద్రాల్లో పరీక్షను జరిపారు.
ఏపీజీబీ ఆఫీసర్స్ ఎన్నికలు
నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ ఎన్నికలను నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును బ్యాంక్ అధికారులు వినియోగించుకున్నారు.
విద్యుత్ సంస్థలో
భారీగా ఉద్యోగోన్నతులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భారీగా ఉద్యోగోన్నతులు లభించాయి. మెరిట్, సీనియార్టీ ఆధారంగా 46 మందికి ఇవి లభించాయని ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వీరికి ఉద్యోగోన్నత పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జూనియర్ లైన్‌మెన్ నుంచి సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు ఇవి లభించాయని వెల్లడించారు.
విద్యుత్ బిల్లులను
నేడూ చెల్లించొచ్చు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లులను ఆదివారం యథావిధిగా చెల్లించొచ్చని ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రాఘవేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని బిల్లుల వసూలు కేంద్రాలు పనిచేయనున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కృత్రిమ కొరత
సృష్టిస్తే కేసులు
నెల్లూరు(పొగతోట): డీజిల్, పెట్రోల్‌కు కృత్రిమ కొరత సృష్టించేలా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యవహరిస్తున్నారు. బంకుల నుంచి అధిక మొత్తంలో డీజిల్‌ను కొనుగోలు చేసి డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో నగర పరిసర ప్రాంతాల్లో తనిఖీలను సివిల్ సప్లయ్స్ అధికారులు శనివారం చేపట్టారు. ఇలా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేయనున్నామని హెచ్చరించారు. పెట్రోల్ బంకులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి.. అధికంగా కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 69,270 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 33,180 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


