కోవూరు: క్రమ శిక్షణకు మారు పేరు అని చెప్పుకొనే టీడీపీ నేతలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలోనే తన్నులాడుకున్న ఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని గుర్తు చేసిన నేపథ్యంలో స్థానికులపై నోటిదురుసుకు తెగబడడం ఆ పార్టీ నేతల అహంకారానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఈ ఘటన కోవూరులోని సాయిబాబా మందిరంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎన్నికల ముందు సాయిబాబా మందిర అభివృద్ధికి రూ.5 లక్షల డొనేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆమె సాయిబాబా మందిరానికి వచ్చి అక్కడ భజన కార్యక్రమంలో ఉన్న మహిళా భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మందిరానికి డొనేషన్ ఇస్తామని హామీ ఇచ్చారని ఆ మహిళా భక్తులు గుర్తు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేత మల్లారెడ్డి ఆ మహిళలను అవమానిస్తూ మాట్లాడారు. వీళ్లంతా బలిసినోళ్లే.. గుడికి డబ్బులు అవసరమైతే వాళ్లు సమకూర్చుకోగలరు... మీరు డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నోటి దురుసుతో మాట్లాడారు. ఎమ్మెల్యే డొనేషన్ ఇస్తామంటే ఇవ్వొద్దనేందుకు నీవెవరంటూ మరో వర్గం రెచ్చిపోయింది. ఎమ్మెల్యే సమక్షంలోనే మాటా మాటా పెరగడంతో చినికి చినికి గాలివానగా మారినట్లు రెండు వర్గాలు తున్నుకున్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన సాయిబాబా మందిరం రాజకీయ రణరంగంగా మారింది. ఈ దృశ్యాలన్నీ మందిరంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో తమ అరాచకాలు ఎక్కడ బయటకు వస్తాయోనని వాటిని ధ్వంసం చేశారు. టీడీపీ నేతల వ్యవహార తీరుతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే సమక్షంలో
సాయిబాబా మందిరంలో ఘటన
మహిళలను అవమానిస్తూ
నోరుపారేసుకున్న టీడీపీ నేత
ఆయనపై రెచ్చిపోయిన మరో వర్గం నేతలు
చినికి చినికి గాలివానగా మారిన వైనం
ఘర్షణ తర్వాత సీసీ కెమెరాలు ధ్వంసం
టీడీపీ నేత నోటి దురుసు ప్రవర్తన ఆధారాలు
మాయం చేసేందుకేననే ఆరోపణలు
ఇరువర్గాలపై కేసులు నమోదు


