● బ్లాక్‌స్పాట్‌లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నెల్లూరు(క్రైమ్): ‘రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం’ కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్లను శుక్రవారం కలెక్టర్, ఎస్పీ అజిత పరిశీలించారు. గతేడాది, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై ఆరాతీశారు. బ్లాక్‌స్పాట్లలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, సీసీ టీవీ నిఘాను పెంచాలని, ట్రాఫిక్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ ఽఅధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సూచికలు, హెచ్చరిక బోర్డులు, లైటింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించాలన్నారు. మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి లోపాలను తక్షణమే సరిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని, మద్యం మత్తు, మితిమీరిన వేగంతో వాహనాలను నడపరాదన్నారు. వారి వెంట ఆర్డీఓ అనూష, పోలీసు అధికారులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.
కార్మికుల వేతనాలపై నిర్ణయం
నెల్లూరురూరల్: 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి నామినల్ మస్తర్ రోల్ కార్మికుల కనీస వేతనాలను కమిటీ నిర్ణయించింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్‌లో సమావేశం జరిగింది. నెల్లూరు ఉప కార్మిక కమిషనర్, జిల్లాలోని ఇంజినీరింగ్ వర్క్స్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్య స్థాయి ఆధారంగా రోజువారీ వేతనాలను ఖరారు చేశారు. అన్‌స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.615, సెమీస్కిల్డ్ వారికి రూ.735, స్కిల్డ్ వారికి రూ.870, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ.990 వేతనంగా నిర్ణయించారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులకు పైవేతనాలపై అదనంగా 20 శాతం, కార్పొరేషన్ పరిధిలో పనిచేసే వారికి 25 శాతం అదనపు భత్యం చెల్లించాలన్నారు. ఈ నిర్ణయాలను ఉప కార్మిక కమిషనర్ సీహెచ్ విజయకుమార్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు.


