నెల్లూరు(పొగతోట): చిన్నపిల్లలతో భిక్షాటన చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి.సురేష్ హెచ్చరించారు. భిక్షాటన చేసే బాలలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఏర్పాటు చేశారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం బృంద సభ్యులు నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్, వీఆర్సీ సెంటర్, ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి సెంటర్ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించారు. నలుగురు బాలికలు, ఒక బాలుడిని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం పిల్లలను సీడబ్ల్యూసీ ఆదేశాల ప్రకారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలల చేత భిక్షాటన చేయించే వ్యక్తికి 5 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందన్నారు. భిక్షాటన కోసం బాలలను దివ్యాంగులను చేసే వారికి 10 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తారన్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు వై.శ్రీహరి, డి.సతీష్, రాంబాబు, సిబ్బంది సుమలత, రత్నం, సుజాత, శైలజ పాల్గొన్నారు.


