సీతారామపురం: కూటమి ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా, నెత్తిన కుంపటిగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే ఏ రైతును ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు. వ్యవసాయం అంటే.. అన్నదాతలు దడుచుకునే పరిస్థితిని సృష్టిస్తోంది. సర్కారు నిర్లక్ష్యం, దళారుల దోపిడీ ఖాతాలో తాజాగా మొక్కజొన్న రైతులు చేరారు. తక్కువ సమయంలో పంట చేతుకుందుతుందని ఎన్నో ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులను నష్టాల ఊబిలోకి కూర్చేసింది. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. ధరలు మాత్రం పాతాళానికి పడిపోయాయి.
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు
జిల్లాలో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా అందులో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో 1200 ఎకరాల్లో సాగు చేస్తే.. మెట్ట ప్రాంతమైన ఒక్క సీతారామపురం మండలంలోనే దాదాపు 400 ఎకరాల్లో సాగు చేశారు. మూడు వారాల క్రితం పంట చేతికొచ్చినా ప్రభుత్వం ఎప్పుడు పంట కొనుగోలు చేస్తుందా? అని రైతులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా.. నేటికీ దిక్కులేని పరిస్థితి నెలకొంది. మొక్కజొన్న పంట ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు పెట్టుబడి అవుతుందని, ఈ దఫా ఆ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.1500 నుంచి రూ.1600 మధ్యనే దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 25 క్వింటాళ్లు దిగుబడి వస్తే.. రూ.40 వేలు కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు గొల్లుమంటున్నారు. గతేడాదిలో ప్రభుత్వం కింటాల్‌కు రూ. 2250 చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేసింది. ప్రస్తుతం మొక్కజొన్నకు కనీసం మద్దతు ధర రూ.2,400 ఉన్నా కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే కొందరు అత్యవసర పరిస్థితుల్లో అడిగిన ధరకు తెగనమ్ముకుంటున్నారు.
మద్దతు ధర ప్రకటించి..
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సాగు ఖర్చులు లెక్కించి క్వింటాల్‌కు రూ.2100 ధర నిర్ణయించి, ఆ మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. గతంలో ఎకరాకు 25 క్వింటాళ్లు పంట దిగుబడి వస్తే.. ప్రస్తుతం ఎకరాకు 25 నుంచి 28 క్వింటాళ్లు దాకా పంట దిగుబడి వచ్చిందన్నారు. ఇటీవల బసినేనిపల్లి ప్రాంతానికి చెందిన మొక్కజొన్న రైతులు కలెక్టర్‌ను కలిసి పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు, గిట్టుబాటు ధరపై మొర పెట్టుకున్నా నేటి వరకు ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు అధికార యంత్రాంగం స్పందించి మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూటమి సర్కారు నిర్లక్ష్యం
పంట చేతికొచ్చి నెల గడిచినా
కొనే దిక్కులేని పరిస్థితి
నష్టానికి దళారులకు
తెగనమ్ముకుంటున్న రైతులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్దతు ధర ప్రకటించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు


