కూటమి నేతలే ఎఫ్‌ఏలు
నెల్లూరు(పొగతోట): టీడీపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ శ్రామికులకు నెలల తరబడి వేతనాలు అందడంలేదు. ఫలితంగా వీరు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్ష మంది హాజరవుతుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య వేలకు పతనమైంది.
అంతులేని నిరీక్షణ
గతంలో బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు వార వారం జమయ్యేవి. అయితే ప్రస్తుతం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పనులకు అధిక శాతం మంది ముఖం చాటేస్తూ.. వ్యవసాయ సంబంధిత వర్కులకెళ్తున్నారు. జనవరికి సంబంధించిన జీతాలను చెల్లించి.. ఆపై వేయలేదు. ఇలా జిల్లాలో రూ.20 కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన నిధులను రెండు రోజుల క్రితం మంజూరు చేశారని సమాచారం. ఇవి శ్రామికుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేందుకు మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది.
సన్నగిల్లిన అవకాశాలు
జిల్లాలో జాబ్‌కార్డులు కలిగిన శ్రామికులు నాలుగు లక్షల మంది ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు పనులకు నిత్యం లక్ష మంది హాజరయ్యేవారు. ఈ వర్కులతో జిల్లాలో నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మంజూరయ్యేవి. అయితే ప్రస్తుతం పనులకొచ్చే వారి సంఖ్య తగ్గిపోవడంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర భవన నిర్మాణాలకు నిధులు విడుదలయ్యే అవకాశాలు సన్నగిల్లిపోయాయి. గతంలో ఏటా రూ.వందల కోట్లతో పనులు చేపట్టగా, ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు.
ఉన్నవి పూర్తయితేనే కొత్తవి..
ఉపాధి హామీ పథకంలో నూతన విధానాలతో పంచాయతీల్లో 20 పనులకే అనుమతులిస్తున్నారు. ఇవి పూర్తయ్యాకే ఇతర వాటి కోసం డిమాండ్ పెట్టాల్సి ఉంది. పంచాయతీల్లో గతంలో వార వారం డిమాండ్ పెట్టే వారు. ఈ– కేవైసీ పూర్తి చేసుకున్న శ్రామికుల ఫొటోలే అప్‌లోడ్ అవుతున్నాయి. ఇవి కాని వారు పనులకు హాజరైనా వేతనాలు జమయ్యే అవకాశాల్లేవు.
నాలుగు నెలలుగా అందని వేతనాలు
రూ.20 కోట్లకుపైగా పెండింగ్
ఉపాధి శ్రామికుల హాహాకారాలు
రోజురోజుకూ తగ్గిపోతున్న
వచ్చే వారి సంఖ్య
గ్రామ పంచాయతీల్లో కూటమి నేతలే ఎఫ్‌ఏలుగా అవతారమెత్తడంతో పనులు ముందుకు సాగడంలేదు. ఉపాధిలో నూతన నిబంధనలు వీరికి మింగుడుపడటం లేదు. బోగస్ మస్టర్లేసుకొని నిధులను స్వాహా చేయాలనే ఆలోచనలకు బ్రేకులుపడ్డాయి. జిల్లాలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న 500 మంది ఎఫ్‌ఏలను తొలగించి వారి స్థానాల్లో అధికార పార్టీ నేతలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కనుసన్నల్లో వర్కులు జరుగుతున్నాయి. వీరు చెప్పిన వారికే పనులు లభిస్తున్నాయి. ఈ తరుణంలో ఆశించిన స్థాయిలో వర్కుల్లేకపోవడం.. వేతనాలు సక్రమంగా రాకపోవడంతో ఇతర వాటివైపు శ్రామికులు మొగ్గు చూపుతున్నారు.


