● దేవదాయ శాఖ అధికారుల తీరుపై ఆశ్చర్యం
● మంత్రి ఆనం సమక్షంలోనే నిలదీసిన డైరెక్టర్ మునిరత్నంరెడ్డి
ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నంలోని కామాక్షిదేవి సమేత సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ఏటా నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 30 వేల మంది భక్తులు హాజరవుతారని దేవదాయ శాఖ అధికారులు వెల్లడించడంపై కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో పునరుద్ధరణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఆలయాధికారులు అందజేసిన నివేదికలు నమ్మశక్యంగా లేవని కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఆలయానికి 30 వేల మంది భక్తులెలా వస్తారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన రికార్డులున్నాయా అంటూ మంత్రితో పాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలోనే నిలదీశారు. మహాశివరాత్రి మహోత్సవాల సమయంలో చిత్రీకరించిన వీడియోలను పురావస్తు శాఖ అధికారులకు చూపగా, పలు ప్రశ్నలను వారు సంధించారు. కనీసం ఐదు వేల మంది సైతం హాజరుకాలేదని అభిప్రాయపడ్డారు.
సమగ్ర సర్వే జరపండి
ఆలయానికి ఇరువైపులా సమగ్రమైన సర్వే చేసి నివేదికను అందజేయాలని మంత్రి ఆదేశించారు. 11వ శతాబ్దం నాటి ఆలయ ప్రాచీన నైపుణ్యం దెబ్బతినకుండా సాంకేతిక పరిజ్ఞానంతో సిమెంట్‌తో నిర్మాణం చేయకుండా పనులు చేపట్టాలని పురావస్తు శాఖ అధికారులకు సూచించారు. ఆలయాధికారులు శేఖర్, గిరికృష్ణ, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


