వామ్మో.. బూడిద బల్కర్లు | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. బూడిద బల్కర్లు

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

బూడిద బల్కర్లు కనిపిస్తే చాలు ప్రజలు హడలిపోతున్నారు. అతివేగం, రహదారి గురించి సరైన అవగాహన లేకపోవడం, నిద్రలేమి తదితర కారణాలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలున్నాయి. నివారించాల్సిన అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వందల సంఖ్యలో రాకపోకలు

అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు

భయం గుప్పిట్లో ప్రజలు

నియంత్రణలో అధికారుల వైఫల్యం

ముత్తుకూరు(పొదలకూరు): ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బల్కర్లు బూడిదను తరలిస్తుంటాయి. నేలటూరులోని ప్రైవేట్‌ పవర్‌ ప్లాంట్లు, ఏపీ జెన్కో నుంచి భారీగా బల్కర్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఇవి దాదాపుగా అన్ని మార్గాల గుండా బయటి రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్తున్న నేపథ్యంలో గ్రామాల పరిధిలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఇటీవల మండలంలోని పంటపాళెం పంచాయతీ పరిధిలో ఇటీవల బల్కర్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. దీంతో పక్కనే ఉన్న పట్టల గోదాముకు మంటలు వ్యాపించి భారీగా నష్టం వాటిల్లింది.

వరుస ప్రమాదాలు

ఇటీవల ఈ ప్రాంతంలో బూడిద బల్కర్ల ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మార్చి 12వ తేదీన మల్లూరు సమీపంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని కాలువలో పడిపోయింది. 14వ తేదీ అర్ధరాత్రి ఏపీ జెన్‌కో సమీపంలో రెండు బల్కర్లు ఎదురెదురుగా ఢీకొని పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ ఘటనల్లో ప్రాణనష్టం జరగలేదు. తోటపల్లిగూడూరు వద్ద నేరుగా దుకాణంలోకి దూసుకెళ్లడంతో ధ్వంసమైంది.

అదే కారణమా?

అధికార పార్టీ నేతల కమీషన్ల కక్కుర్తి కారణంగా బూడిద రవాణా చేసే బల్కర్లు రాత్రింబవళ్లు అతి వేగంతో నడుస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. నియంత్రణ లేకుండా వెళ్తుండటంతో ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. బల్కర్ల నుంచి బూడిద రోడ్డుపై పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. గాలికి దుమ్ము ఎగిరి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. పట్టించుకుంటే కదా..

ప్రమాదాలపై సంబంధిత శాఖల అధికారుల వైపు ఎలాంటి చర్యల్లేవు. ముత్తుకూరు మెయిన్‌ రోడ్డుపై బూడిద పడితే పంచాయతీ నిర్వాహకులు తొలగించాల్సి వస్తోంది. పాఠశాలలకు నుంచి ఇళ్లకు వెళ్లే చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు భయాందోళనకు లోనవుతున్నారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement