బస్‌ షెల్టర్‌ను తొలగించేందుకు తమ్ముళ్ల యత్నం | - | Sakshi
Sakshi News home page

బస్‌ షెల్టర్‌ను తొలగించేందుకు తమ్ముళ్ల యత్నం

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

అడ్డుకున్న ఎంపీడీఓ

ప్రయాణికులకు నీడ లేకుండా

చేసేందుకు కుట్ర

చేజర్ల: తెలుగుదేశం పార్టీ నేతల అరాచకాలకు అడ్డు లేకుండా పోతోంది. మండల కేంద్రమైన చేజర్లలో ప్రయాణికుల కోసం దాతలు పంచాయతీ స్థలంలో షెల్టర్‌ను 20 సంవత్సరాల క్రితం నిర్మించారు. తాము నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ఇది అడ్డుగా ఉందని తెలుగు తమ్ముళ్లు కూలగొట్టేందుకు గురువారం ప్రయత్నించగా మండల అభివృద్ధి అధికారి, చేజర్ల గ్రామ ప్రత్యేకాధికారి అమర్‌ అడ్డుకున్నారు. అనుమతుల్లేకుండా కూల్చితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య తన తల్లి వెంకమ్మ జ్ఞాపకార్థం ఈ షెల్టర్‌ను సొంత నిధులతో బస్టాండ్‌ ఆవరణలో నిర్మించారు. దానికి ఇరువైపులా పంచాయతీ పాలకవర్గం శాశ్వత ప్రాతిపదికన షాపులను నిర్మించి అద్దెకిచ్చింది.

ఏం చేశారంటే..

బస్‌ షెల్టర్‌ వెనుక భాగంలో దేవదాయ శాఖకు స్థలం ఉంది. అందులో తెలుగు తమ్ముళ్లు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి దుకాణాలు అద్దెకు ఇచ్చారు. దాని ముందుభాగాన ఇరువైపులా పంచాయతీ షాపులు, షెల్టర్‌ ఉన్నాయి. వీటిని తొలగించాలని మొన్నటి వరకు ఉన్న పాలకవర్గంపై నేతలు ఒత్తిడి తెచ్చారు. పంచాయతీకి ఆదాయం తెచ్చే షాపులను, ప్రయాణికులకు విశ్రాంతినిచ్చే షెల్టర్‌ను తొలగించేది లేదని అప్పట్లో పాలకవర్గం తేల్చి చెప్పింది. దీంతో పదవీకాలం ముగిసే వరకు వేచి చూసిన తెలుగు తమ్ముళ్లు ఏప్రిల్‌ రెండో తేదీన షెల్టర్‌ను, పంచాయతీ గదులను కూలదోసేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఈ ప్రయత్నాన్ని ప్రారంభించగా ఎంపీడీఓ అడ్డుకున్నారు. అసలే వేసవికాలం. నీడనిచ్చే షెల్టర్‌ను కూలగొట్టే విషయంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని మండి పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement