● ప్రాణాలు కాపాడిన సంగం పోలీసులు
సంగం: కారు కాలువలోకి దూసుకెళ్లింది. సంగం పోలీసులు తక్షణమే స్పందించడంతో వాహనంలోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరు జేఆర్ పేటకు చెందిన షేక్ నాగూర్ తన సోదరి షేక్ నాగూర్‌బీ, ఆమె పిల్లలతో కలిసి బుధవారం సాయంత్రం నెల్లూరుకు కారులో వెళ్లారు. నారాయణ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అర్ధరాత్రి సొంతూరికి బయలుదేరారు. పెరమన గ్రామం వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న నాగూర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.ఎస్సై రాజేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు బాధితులను కారులో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వారిని పోలీస్ వాహనంలో ఆత్మకూరుకు తీసుకెళ్లారు.


