నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జాతీయ రహదారిపై పెన్నానది బ్రిడ్జి వద్ద కారు పూర్తిగా దగ్ధమైన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. విడవలూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో నరుకూరుకు వెళ్లాడు. తిరిగి తెల్లవారుజామున విడవలూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో పెన్నానది వంతెన వద్దకు రాగానే కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సుబ్రహ్మణ్యం వెంటనే కారును రోడ్డు పక్కన ఆపాడు. కొన్ని నిమిషాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ కేసు నమోదు చేశారు.


