సంక్షేమ ప్రదాత జగన్
● జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలి
● బోట్ల మిస్సింగ్‌లో కారకులను శిక్షించాలి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు రూరల్: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం తప్పులపై తప్పులు చేస్తోందని, మత్స్యకారుల బోట్ల దొంగతనం కూడా ఇందులో భాగమేనని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారుల్లో కొందరు చేసిన తప్పునకు వాళ్ల పెద్దలు జరిమానాలను విధించారని, అయితే దీన్ని ప్రోత్సహించిన టీడీపీ నేతలు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రపై చర్యలను చేపట్టకుండా సీఎం చంద్రబాబు మీనమేషాలను లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. గంగపుత్రుల సంక్షేమానికి ఎవరేమి చేశారో తేల్చే విషయమై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ, మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీస్తున్న బోట్ల మాయంపై పోరాటాలను తమ పార్టీ సాగిస్తోందని వివరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాగా, ఆయన్ను మత్స్యకారులు కలిశారని చెప్పారు. ఆ సమయంలో బండారం మొత్తాన్ని మత్స్యకారులు బయటపెడితే ఇబ్బందులు తప్పవని భావించిన ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, జగన్‌మోహన్‌రెడ్డి రాకతో ఆ ప్రాంతం జనసంద్రమైందని గుర్తుచేశారు.
వారి నీతిని ఆదర్శంగా తీసుకోండి..
సింగరాయకొండ మండలం పాకల వద్ద సమావేశాన్ని మత్స్యకారులు ఈ నెల ఆరున నిర్వహించారని చెప్పారు. బీద మస్తాన్‌రావుతో పాటు కావలి సీఐ ప్రోద్బలంతోనే బోట్ల విడుదలకు తాము సహకరించామని వారు అంగీకరించారని తెలిపారు. సంప్రదాయం ప్రకారం ఘటనపై రూ.ఐదు కోట్ల జరిమానాను విధించగా, అంత కట్టలేమని పేద మత్స్యకారులు చెప్పగా, సమావేశాన్ని వాయిదా వేశారని వివరించారు. తాజాగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తప్పును మత్స్యకారులు అంగీకరించగా, రూ.2.25 కోట్ల జరిమానాను విధించారన్నారు. వీరు నీతి, నిజాయతీగా వ్యవహరించి తప్పు చేసిన తోటి మత్స్యకారులపై జరిమానాను విధించడం గొప్ప విషయమని, ఈ తీరును ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. అయితే వీరికి ద్రోహం చేసింది తమ వారేగా.. ఏమవుతుందనే రీతిలో సర్కార్ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
టీడీపీ నేతలను తప్పిస్తున్నారు..
సాగర్ డిఫెన్స్‌కు సంబంధించి జువ్వలదిన్నెకు మంత్రి లోకేశ్ ఏ రోజైతే వచ్చారో.. బోట్ల దొంగతనానికి అప్పుడే బీజం పడిందని కాకాణి ఆరోపించారు. ఇందులో భాగంగా పోలీసులు జోక్యం చేసుకొని తమను మభ్యపెట్టారని తోటయ్య అనే వ్యక్తి పాకలలో జరిగిన మత్స్యకారుల సమావేశంలో చెప్పారన్నారు. ఈ తప్పు చేసిన బీద మస్తాన్‌రావు, రవిచంద్రపై చర్యలు చేపడుతుందో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోషులతో తనకు సంబంధం లేదని బీద మస్తాన్‌రావు చెప్పారని.. అయితే రవిచంద్ర మాత్రం తాము మాట్లాడితే తప్పా.. శుభాకాంక్షలు చెప్పామంటున్నారని, వీరి వ్యాఖ్యల బట్టే అసలు విషయం అర్థమవుతోందని తెలిపారు. మత్స్యకారులకు తాము అండగా నిలిస్తే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
మత్స్యకారులకు తమ పార్టీ ఏమి చేసిందో అందరికీ తెలుసునని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేట నిషేధ సమయంలో రూ.నాలుగు వేలనే ఇచ్చారని చెప్పారు. అదే తమ హయాంలో వీరికి రూ.పది వేల చొప్పున అందజేసిన అంశాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు రూ.20 వేలిస్తామని చెప్పి ఎగ్గొట్టలేదానని చంద్రబాబును ప్రశ్నించారు. బకాయిలను చెల్లించకుండా వీరిని పస్తులుంచిన చరిత్ర మీదని దుయ్యబట్టారు. మత్స్యశాఖ జేడీకి టీడీపీ ఫిర్యాదు చేస్తే, మత్స్యకారులను పక్కనబెట్టడం పక్షపాత వైఖరి కాదానని నిలదీశారు. వీరికి అండగా ఎవరు నిలిచారనే అంశమై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. బీద మస్తాన్‌రావుపై చర్యలు చేపడితే కొల్లు రవీంద్ర, లోకేశ్ పేర్లు బయటకొస్తాయనే భయంతోనే మిన్నకుండిపోతున్నారని విమర్శించారు. ఈ తప్పును మత్స్యకార కుటుంబాలు క్షమించవని, ఈ విషయంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పదని స్పష్టం చేశారు. బోట్ల మిస్సింగ్‌కు కారకులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


