రెండో పంటకు 4న సాగునీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

రెండో పంటకు 4న సాగునీటి విడుదల

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

4.47 లక్షలెకరాలకు..

ఐఏబీలో తీర్మానం

నెల్లూరు(పొగతోట): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో పంటకు సాగునీటిని వచ్చే నెల నాలుగున విడుదల చేయనున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశాన్ని మంత్రి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 4,47,322 ఎకరాలకు 49 టీఎంసీలను విడుదల చేయాలని తీర్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పులొచ్చే అవకాశమున్న తరుణంలో, నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. కాలువల పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు సూచించారు. సోమశిల ప్రాజెక్ట్‌ ఉండేది ఆత్మకూరు నియోజకవర్గంలోనేనని, తాము గేట్లెత్తితేనే కింది ప్రాంతాలకు నీరు పారుతుందని తెలిపారు. మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరిలో పరిస్థితి దయనీయంగా ఉందని వివరించారు. వీరి జీవితాల్లో వెలుగులు రావాలంటే సోమశిల హైలెవల్‌ కెనాల్‌ పనులు పూర్తి కావాలని తెలిపారు. రానున్న ఐఏబీ సమావేశానికి తిరుపతి కలెక్టర్‌, ఇరిగేషన్‌ అధికారులను ఆహ్వానించాలని సూచించారు.

విడుదల ఇలా..

పెన్నా డెల్టా ఆయకట్టు 2,02,322.. కనుపూరు కాలువ 27 వేలు.. సోమశిల ప్రాజెక్ట్‌ కావలి కాలువ 74 వేలు.. దక్షిణ కాలువ 20 వేలు.. కండలేరు జలాశయ కాలువల ద్వారా 1.24 లక్షలెకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. దీనికి గానూ 49.76 టీఎంసీలను కేటాయించారు.

గత సీజన్లో ఏడు లక్షలెకరాలకు..

గత సీజన్లో ఏడు లక్షలెకరాలకు సాగునీటిని విడుదల చేశామని వెల్లడించారు. వర్షాలతో 20 టీఎంసీలు ఆదా కాగా, 133 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులున్నాయని, వీటిని సరిచేసుకొని ముందుకుసాగాలని కోరారు. సోమశిలలో 58.17, కండలేరులో 18 టీఎంసీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని.. తాగునీరు, ఆవిరి, తిరుపతి, చైన్నెకి మంచినీరు తదితర అవసరాలు పొనూ 49 టీఎంసీలు ఉంటాయని చెప్పారు. అందుబాటులో ఉన్న నీటిని రెండో పంటకు విడుదల చేసేలా తీర్మానించామని ప్రకటించారు. నివేదికలను ప్రభుత్వానికి పంపి అనుమతులను పొందనున్నామన్నారు. సమావేశాలకు హాజరుకాని ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులకు మెమోలను జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలను శాసనసభ్యులు లేవనెత్తారు. ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నెలవల విజయశ్రీ, కాకర్ల సురేష్‌, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్‌రెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు దేశ్‌నాయక్‌, వెంకటరమణారెడ్డి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, తిరుపతి ఎస్‌ఈ రాధాకృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement