మాయమాటలతో ఉద్యోగులకు వంచన | - | Sakshi
Sakshi News home page

మాయమాటలతో ఉద్యోగులకు వంచన

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

ప్రభుత్వంపై ధ్వజమెత్తిన పర్వతరెడ్డి

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాయమాటలు చెప్పి ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దుయ్యబట్టారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాలా మేలు చేస్తామని గత ఎన్నికలకు ముందు టీడీపీ ఊదరగొట్టిందని, అయితే ప్రస్తుతం వీటిని గాలికొదిలేసిందని ఆరోపించారు.

ఆ కథనాలు హేయం

ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని చూస్తుంటే ఉద్యోగులు ఉలిక్కిపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఎల్లో మీడియాలో ప్రజా వ్యతిరేక వార్తలను రాయించడం.. ఆపై వీటిని చంద్రబాబు అమలు చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యో గుల జీతాలు, పెన్షన్ల వ్యయమెక్కువగా ఉందని, ఇలా అయితే మనదీ హిమాచల్‌ప్రదేశ్‌ తరహాలో మారుతుందని.. వేతనాలను తగ్గిస్తామని అక్కడి ప్రభుత్వం పే ర్కొందని, ఇక్కడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటూ కథనాలను ప్రచురించి దుర్మార్గపు వైఖరిని అ వలంబిస్తోందని మండిపడ్డారు. కోవిడ్‌ లాంటి విపత్క ర పరిస్థితుల్లోనూ ఒకటో తేదీనే జీతాలను అప్పటి త మ ప్రభుత్వమిచ్చిందని గుర్తుచేశారు. అన్ని ఇబ్బందుల్లోనూ పీఆర్సీని నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమ లు చేశారని చెప్పారు. ఉద్యోగోన్నతులను కల్పించి.. స హాయ, సహకారాలను అందించారని కొనియాడారు.

అన్నింట్లో మోసమే..

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ కలిసిచ్చిన మేనిఫెస్టోను ఆ రోజు అందరూ నమ్మారని, అయితే నేడు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మెరుగైన పెన్షన్‌ విధానాన్ని తీసుకొస్తామని, మంచి పీఆర్సీని అమలు చేస్తామని చెప్పారని, అయితే పీఆర్సీకి సంబంధించిన కమిషన్‌ను నేటికీ వేయలేదని విమర్శించారు. ఐఆర్‌ను ప్రకటిస్తామని చెప్పినా, నేటికీ అతీగతీ లేదని తెలిపా రు. ఇలా అన్ని రంగాల్లోనూ దారుణంగా వంచించారని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు సంబంధించిన రూ.35 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయినా, వాటిని చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పచ్చ పత్రికల్లో అసత్య కథనాలను ప్రచురించి.. జీతాలు పెంచాలని ఉద్యోగులు అడగకుండా వారిని మానసికంగా తయారు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

ఉద్యోగం నుంచి తొలగించడం అనైతికం

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని అనైతిక చర్యగా అభివర్ణించారు. ఉద్యోగుల హక్కులపై మాట్లాడకూడదనే దుర్మార్గపు ఆలోచనతో సర్కార్‌ ఈ విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం కొలువుదీరిన 22 నెలల్లోనే రూ.3.56 లక్షల కోట్ల అప్పు చేసిందని ధ్వజమెత్తారు. 7.81 వడ్డీకి రుణాన్ని తెస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోందని ఆరోపించారు. వీటిని కూటమి నేతలు దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో రూ.55 వేల కోట్లతో పనులను ప్రారంభిస్తున్నామని చెప్పి, టెండర్లు పిలిచి వారందరికీ మొబిలైజేషన్‌ ఫండ్స్‌ కింద పది శాతం అంటే రూ.5500 కోట్లను మంజూరు చేసి కమీషన్‌ రూపంలో ఎనిమిది శాతాన్ని తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, పనుల్లేక పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హెలికాప్టర్లలో సీఎం, డిప్యూటీ సీఎం తిరుగుతూ ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement