● మంత్రి ఆదేశాలతో ఓ వర్గానికి రెవెన్యూ అధికారుల వత్తాసు
● కోర్టు ఉత్తర్వుల ధిక్కారం
చేజర్ల: మండలంలోని తిమ్మాయిపాళెం రెవెన్యూ పరిధిలో గల ఉలవపల్లి గ్రామంలో భూ వివాద నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత బుధవారం నెలకొంది. బోడిపాడుకు చెందిన ఎంపీటీసీ సభ్యుడు మస్తానయ్య కుటుంబసభ్యుల పేరుతో 12 ఎకరాలపైగా భూములున్నాయి. ఈ క్రమంలో ఉలవపల్లికి చెందిన వెంకటస్వామికి గతంలో ప్రభుత్వం పట్టా ఇచ్చి.. అనంతరం రద్దు చేయడంతో కోర్టును ఆయన ఆశ్రయించారు. ఆయనకు ఎక్కడో చోట భూమిని చూపాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలో మస్తానయ్య సాగు చేసుకుంటున్న సర్వే నంబర్లేసి వెంకటస్వామికి నకిలీ పట్టాలను రెవెన్యూ అధికారులు అందజేశారు. దీనిపై వివాదం నడుస్తోంది. ఈ తరుణంలో ఎంపీటీసీని ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో ప్రత్యర్థులను మంత్రి అనుచరులు పురమాయించారు. పొలం వద్దకు జేసీబీతో వచ్చి చదును చేసే క్రమంలో మస్తానయ్య అడ్డుకున్నారు. దీంతో ఆయనపై వెంకటస్వామి వర్గం దాడికి యత్నించింది. ఈ విషయంలో న్యాయస్థాన ఆదేశాలున్నా, రాజకీయంగా ఒత్తిడి తెచ్చి వెంకటస్వామికి అనుకూలంగా మారారని మస్తానయ్య వాపోయారు. కాగా భూ వివాదంలో న్యాయం చేస్తానంటూ స్థానిక తహసీల్దార్ తనను నగదును డిమాండ్ చేశారని, అయితే ఇవ్వకపోవడంతో ఆయనే ప్రత్యర్థులను పురమాయించి పొలం వద్దకు పంపారని ఆరోపించారు.


