● ఐదు నుంచి సమ్మెలోకి..
● ప్రజా రవాణాధికారికి నోటీస్‌ను నేడు ఇవ్వనున్న జేఏసీ
నెల్లూరు సిటీ: నగరంలోని ఆర్టీసీ రెండో డిపోకు సంబంధించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చేస్తున్న యత్నాలను నిరసిస్తూ 72 రోజులుగా ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమర శంఖారావాన్ని పూరించేందుకు వీరు సిద్ధమయ్యారు. జిల్లాలోని ఏడు డిపోల్లో మే ఐదు నుంచి సమ్మె చేసేందుకు ఉపక్రమించారు. నగరంలోని ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లో ఆర్టీసీ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. సమ్మెకు సిద్ధమవ్వా లని ఉద్యోగులకు సూచించారు. దీనికి సంబంధించిన నోటీస్‌ను ప్రజా రవాణాధికారి షమీమ్‌కు బుధవారం అందజేయనున్నామని జేఏసీ నేత ప్రసాద్ తెలిపారు.
విలువైన స్థలాన్ని కట్టబెట్టేందుకు..
నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో రెండో డిపోకు సంబంధించిన ఐదెకరాల స్థలం విలువ దాదాపు రూ.200 కోట్ల వరకు ఉంటుంది. దీన్ని ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేసుకునేందుకు టెండర్ ద్వారా పినాకిల్ అనే కంపెనీకి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా, సర్కార్‌కు చీమ కుట్టినట్లు కూడా లేదు. దీనిపై విసిగి వేసారి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు.
నేటి నుంచి డబుల్ డ్యూటీ బాయ్‌కాట్
నెల్లూరు రెండో డిపోలోని ఉద్యోగులు డబుల్ డ్యూటీని గురువారం నుంచి బాయ్‌కాట్ చేయనున్నారు. ఈ డిపోలో ఎన్నో ఏళ్లుగా దాదాపు 540 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 70 మందిని ఒకటో డిపోకు.. 470 మందిని ఇతర డిపోలకు తరలించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉద్యోగులతో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్ బస్సులను కంపెనీ యాజమాన్యమే నడపనుంది. ఈ పరిణామాల క్రమంలో భద్రత, అలవెన్స్‌ను వీరు కోల్పోయే ప్రమాదం ఉంది. వీరిలో వయస్సు పైబడిన వారి సంఖ్యా ఎక్కువగా ఉంది. ఆరోగ్య రీత్యా ఇతర డిపోలకు తరలించడం ద్వారా తమపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


