కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తే చర్యలు

Apr 23 2026 7:24 AM | Updated on Apr 23 2026 7:24 AM

నెల్లూరు రూరల్‌: జిల్లాలో పండ్లను సురక్షితంగా పక్వం చేయడం.. హానికరమైన రసాయనాల వినియోగాన్ని నిరోధించేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని ఆహార భద్రత కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు జేసీ మొగిలి వెంకటేశ్వర్లు అధ్యక్షతన కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాల్షియం కార్బైడ్‌ వినియోగంపై కఠినంగా వ్యవహరించనున్నామని స్పష్టం చేశారు. ఎథిలిన్‌ వాయువుతో పనిచేసే రిఫైనింగ్‌ చాంబర్లనే వినియోగించాలని సూచించారు. రసాయనాలను పండ్లపై నేరుగా వేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలను విధించడంతో పాటు చట్టపరమైన చర్యలను చేపడతామని పేర్కొన్నారు. మార్కెట్లు, గోదాములు, రవాణా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించనున్నామని వెల్లడించారు. వ్యాపారులు, రైతులు, సరఫరాదారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు సురక్షిత పండ్ల గుర్తింపుపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామని ప్రకటించారు.

శ్రీవారి దర్శనానికి

ఆరు గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 73,324 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 22,955 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement