● రాళ్లమిట్టలో తాగునీటికి కటకట
● సమస్యను తెలియజేసేందుకు
పంచాయతీ కార్యాలయానికి మహిళలు
● కార్యదర్శి బెదిరింపు ధోరణి
కోవూరు: దాహార్తి తీర్చాలని కోరగా, కేసులు పెడతామంటూ ఓ అధికారి చిందులేసిన ఘటన కోవూరులో కలకలం రేపింది. స్థానిక రాళ్లమిట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో, ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయానికెళ్లిన మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. వాస్తవానికి రాళ్లమిట్టలో తాగునీటి సరఫరా కొంతకాలంగా నిలిచిపోవడంతో స్థానికులు నరకయాతనను అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ ఉమాతో పాటు మహిళలు, ఆ ప్రాంత ప్రజలు బుధవారం వెళ్లారు. అయితే కార్యదర్శి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మోటార్ చెడిపోయింది.. రిపేరయ్యాకే నీళ్లొస్తాయి.. అప్పుడే తాగండి అంటూ వెటకారంగా మాట్లాడారు. ఇదే విషయమై మరోసారి వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపు ధోరణితో వ్యవహరించారు.
విజ్ఞప్తి.. పెడచెవిన
ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారానైనా తాగునీటిని సరఫరా చేయాలని మహిళలు చేసిన విజ్ఞప్తినీ కార్యదర్శి పట్టించుకోలేదు. తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేయనున్నామని స్థానికులు స్పష్టం చేశారు.


