నెల్లూరు(వీఆర్సీసెంటర్): మలేరియా నిర్మూలనే లక్ష్యమని డీఎంహెచ్‌ఓ సుజాత అన్నారు. ఈనెల 25వ తేదీన వరల్డ్ మలేరియా డే సందర్భంగా నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్యశాఖధికారి కార్యాలయంలో బుధవారం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుడు మనం సాధించగలం – ఇప్పుడు మనం తప్పక సాధించాలి’ అనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. 2030 సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనే అంతిమ లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. 25న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సబ్‌యూనిట్ అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టాలన్నారు. కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏఎంఓ జయరాం, డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


