వెంకటాచలం: చెరువులో ఉన్న చేపలను పట్టుకోవాలనే స్వార్థం వారిది.. ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మండలంలో పది గ్రామాలకు పైగా తాగు, సాగునీరుకు అందించే ప్రధానమైన కనుపూరు చెరువు ప్రస్తుతం అడుగంటి ఎండిపోయే స్థితికి చేరింది. చేపల కోసం చెరువులో ఉన్న నీటిని కాలువలకు వృథాగా వదిలేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేతల అండతోనే..
మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్ తర్వాత సాగు, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కనుపూరు చెరువు అడిగంటిపోయింది. ఇక్కడ నీరు పుష్కలంగా ఉంటే వెంకటాచలం, కనుపూరు, కందలపాడు, చవటపాళెం, తిక్కవరప్పాడు, కంటేపల్లి, కాకుటూరు తదితర గ్రామాల్లోని బావులు అడుగంటకుండా ఉంటాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఎటువంటి సాగునీటి సమస్య రాదు. అయితే చెరువులో రూ.లక్షలు విలువైన చేపలు, రొయ్యలు ఉన్నాయి. దీంతో కనుపూరు చెరువు చేపల సొసైటీ నిర్వాహకులు నీటిని కాలువలకు వదిలేసి చేపలు పట్టేందుకు పూనుకున్నారు. ఇలా చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా, కొందరు టీడీపీ నాయకుల అండ చూసుకుని చెరువు నీటిని కాలువల ద్వారా వృథాగా వదిలేశారు.
అధికారులకు మామూళ్లు
కనుపూరు చెరువు నీటిని కాలువలకు వదిలేయడంతో వెంకటాచలం, కనుపూరు, చవటపాళెం గ్రామాల రైతులు, ప్రజలు చేపల సొసైటీ నిర్వాహకులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. మార్చి నెల 20 తేదీ నుంచి చెరువులో ఉన్న నీటిని కాలువలకు వదిలేస్తున్నారు. వెంకటాచలం, కనుపూరు గ్రామాల ప్రజలు ఇరిగేషన్ ఏఈకి చెప్పినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని రైతులు చెబుతున్నారు. మామూళ్ల మత్తు కారణంగానే అధికారులు కనుపూరు చెరువు నీటిని బయటకు వెళ్లనీయకుండా చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి.
ప్రజల డిమాండ్
కనుపూరు చెరువు పూర్తిగా అడుగంటిపోతే 10 గ్రామాల్లో ఇప్పట్నుంచే తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువులో నీరు లేనికారణంగా నేల, బోరు బావుల్లో నీరు అడుగంటి, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. కేవలం చేపల సొసైటీ నిర్వాహకులకు ప్రయోజనం చేకూర్చేందుకు కనుపూరు చెరువును ఎండబెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య పూర్తిస్థాయిలో రాకముందే చెరువుకు నీరు విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చేపల వేట కోసం చెరువు నీళ్లు ఖాళీ
కాలువలకు వదిలేస్తున్న వైనం
అడుగంటిన కనుపూరు చెరువు
10 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉత్పన్నం
పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు


